Asianet News TeluguAsianet News Telugu

రెడ్‌లైట్ దాటినా.. అతివేగమైనా కష్టమే: ఢిల్లీ ట్రాఫిక్ కంట్రోల్‌లో ‘మారుతి‘

దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సీఎస్ఆర్ ఇన్షియేటివ్ కూడా చేపట్టింది. ఢిల్లీ పోలీసులతో కలిసి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి పని బట్టేందుకు పూనుకున్నది

Maruti Suzuki means no escape for traffic offenders even at night
Author
New Delhi, First Published Mar 3, 2019, 2:56 PM IST

ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల భారతదేశంలో 1.5 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. ట్రాపిక్, రవాణాశాఖల అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నా కానీ మరణాలు తగ్గడం లేదు.

దీంతో రోడ్డు దాటే వారి రక్షణ, రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనల పాటించే విధానాన్ని మెరుగుపరచడం కోసం దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సీఎస్ఆర్ ఇన్షియేటివ్‌లో భాగంగా కార్యాచరణ చేపట్టింది. ప్రత్యేకించి దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు.

రోడ్ల కూడళ్ల వద్ద ప్రమాదాలను తగ్గించడానికి పూర్తిగా ఆటోమేటిక్‌గా నడిచే వ్యవస్థను రూపొందించింది. రెడ్‌ లైట్‌ దాటినా, అధిక వేగంతో వెళ్లే వారిని గుర్తించడం దగ్గర నుంచి ఈ-చలాన్‌ను జారీ చేయడం వరకు ఈ వ్యవస్థే తనంతట తాను విధులు నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇందులో మానవ వనరుల వినియోగం అసలే అవసరం ఉండదు.

తద్వారా పాదచారుల భద్రతపై మరింత స్పృహను పెంచడంతో పాటు ట్రాఫిక్‌ సజావుగా నడిచేలా చూస్తుంది.మారుతి సుజుకి అభివ్రుద్ధి చేసిన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలో 3డీ రాడార్లు ఉంటాయి. 100కు పైగా అధిక నాణ్యత ఉండే కెమెరాలు వాహనాలను, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనను పరిశీలిస్తాయి. 

ఈ కెమెరాలు రెడ్‌ సిగ్నల్‌ను దాటడం; అధిక వేగంతో వెళ్లడం, స్టాప్‌ లైన్‌ను దాటడం వంటి ఉల్లంఘించిన ఘటనలను గుర్తిస్తాయి. అలా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల రిజిస్ట్రేషన్‌ సంఖ్యను కూడా గుర్తించిన కెమెరాల నుంచి ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి సమాచారాన్ని పంపుతుంది. 

అంతేకాదు ఫొటో సాక్ష్యంతో పాటు ఈ-చలాన్‌ను సైతం ఎస్‌ఎమ్‌ఎస్‌/ఇమెయిల్‌/పోస్ట్‌ ద్వారా పంపిస్తుంది. ఇంకా డేటా అనలిటిక్స్‌, ఉల్లంఘనల ధోరణుల నివేదికలను కూడా ఈ వ్యవస్థ తయారు చేస్తుంది.24 గంటలూ పనిచేయగలగడం దీని మరో ప్రత్యేకత.

ఇంకేం.. ఇదేదో బాగానే ఉన్నట్లుంది కదా. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలూ ఈదిశగా అడుగేస్తే సరి. ట్రాఫిక్ నిబంధనల ‘ఉల్లంఘనుల’లకు చెక్‌ పెట్టొచ్చు.కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద దిల్లీ పోలీసుల సహకారంతో మారుతీ ఈ రెడ్‌లైట్‌ ఉల్లంఘన గుర్తింపు వ్యవస్థ ‌(ఆర్‌ఎల్‌వీడీఎస్), వేగం ఉల్లంఘన గుర్తింపు (ఎస్‌వీడీఎస్‌) వ్యవస్థలను తీసుకువచ్చింది.

ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి మారుతీ సుజుకీ రూ.16 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ వ్యవస్థను తాజాగా దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతంలో ఆవిష్కరించారు. సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకుంటే ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలనే ఒక సత్సంప్రదాయం సృష్టించడానికి వీలవుతుంది.

ఈ అత్యాధునిక ఆటోమోటెడ్‌ వ్యవస్థ.. వాహనదారుల్లో క్రమశిక్షణను పెంచుతుందని, ట్రాఫిక్‌ నిబంధనల పాటించే విధానాన్ని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యవస్థను ఢిల్లీలోని దౌలా కువాన్‌, సరై కాలే ఖాన్‌ల మధ్య 14 కిలోమీటర్ల పొడవున గల 10 సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేశారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
 

Follow Us:
Download App:
  • android
  • ios