వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యుత్ వాహనాలు చౌక కానున్నాయి. రూ.20 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు రాయితీ లభించనున్నది. విద్యుత్ వాహనాల కొనుగోలు దారులకు రాయితీ కల్పించాలన్న నీతి ఆయోగ్ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 

దేశీయంగా కాలుష్యం నివారించడంతోపాటు అంతర్జాతీయంగా ముడి చమురు దిగుమతిపైనే వాహనాలపై ప్రయాణం, రవాణ రంగం ఆధారపడి ఉన్నది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యేకించి కాలుష్య నివారణ కోసం విద్యుత్ వినియోగ వాహనాలను పెంపొందించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. 

విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ఇన్సెంటివ్ ఇవ్వాలని, అందుకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మూడేళ్ల పాటు ‘ఫేమ్-2’ పథకం అమలు కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

2-4 కిలోవాట్ల బ్యాటరీ అమర్చిన ద్విచక్ర వాహనాల కొనుగోలుపై రూ. 20,000 - రూ.40,000, 5-10 కిలోవాట్ల త్రిచక్ర వాహనాలపై రూ.50 వేల నుంచి రూ. లక్ష, 15-25 కిలోవాట్ల బ్యాటరీ గల నాలుగు చక్రాల వాహనం కొనుగోలుపై రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఆదా చేయొచ్చు. 

బ్యాటరీ సైజ్‌ను సంబంధిత వాహనం కొనుగోలుపై రాయితీ కల్పించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే విద్యుత్ వాహనాలను కొనుగోళ్లను పెంచేందుకు సర్కార్ ద్విముఖ వ్యూహాలను అమలు చేస్తోంది.

మొదటి దశలో భారీగా విద్యుత్ వాహనాలను తయారు చేయడాన్ని ప్రోత్సహించాలన్నది కేంద్ర ప్రభుత్వ అభిమతం. మొదటి దశలో మొత్తం వాహనాల విక్రయంలో 15 శాతం విద్యుత్ వాహనాలు ఉండేలా చూడాలని సర్కార్ వ్యూహం. 

సంప్రదాయ వాహనాల ధరలతో పోలిస్తే విద్యుత్ వాహనాల ధరలు రెండున్నర రెట్లు ఎక్కువ. సంప్రదాయ వాహనాలతో పోలిస్తే నిర్వహణ ఖర్చు నాలుగోవంతు మాత్రమే. గతేడాది 25 వేల విద్యుత్ వాహనాలు అమ్ముడు పోతే, 2017-18లో 56 వేలకు చేరుకున్నది. 

వీటిల్లో విద్యుత్ వినియోగ ద్విచక్ర వాహనాలే ఎక్కువగా అమ్ముడు పోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో 56 వేల వాహనాల్లో ద్విచక్ర వాహనాలు 54,800 కాగా, 2016-17లో అది 23 వేల బైక్‌లు, స్కూటర్లుగా ఉంది.

నాలుగు చక్రాల వాహనాలు 2017-18లో 1200 అమ్ముడు పోతే, 2016-17లో 2,000 మాత్రమే అమ్ముడయ్యాయి. వచ్చే మూడేళ్లలో 15 లక్షల విద్యుత్ వాహనాలను అమ్ముడు పోయేలా చూడాలన్నది ప్రభుత్వ అభిమతంగా కనిపిస్తోంది.