హైదరాబాద్: టెక్నాలజీ కంపెనీ టెక్‌ మహీంద్రా తాజాగా టెలికం విభాగంలో బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఫేక్‌ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని, 30 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ తెలియజేసింది.

బ్లాక్ చెయిన్ టెక్నాలజీ మార్కెట్లో 25 శాతం వాటా
గతేడాది బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశామని, 25 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నామని కంపెనీ గ్లోబల్‌ ప్రాక్టీస్‌ లీడర్‌ రాజేశ్‌ దుడ్డు ఇటీవల చెప్పారు. టెలికంతో పాటు తయారీ, ఆర్ధిక, హైటెక్‌ రంగాల్లోనూ బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతను అందిస్తున్నామని పేర్కొన్నారు. 

టెలికం సంస్థల కస్టమర్ల డేటా స్టోరేజీ కూడా
టెలికం రంగంలో వివిధ టెలికం సంస్థల సబ్ స్ర్కైబర్ల డాటాను కూడా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగంతో స్టోర్ చేస్తున్నట్లు టెక్ మహీంద్రా తెలిపింది. దీని ప్రకారం ప్రతి కస్టమర్ తమ టెలికం సర్వీస్ ప్రొవైడర్ అందజేసే యాప్ ద్వారా తమ ప్రాధాన్యాలు, మార్గదర్శకాలు తెలియజేస్తే తదుపరి ఫేక్ కాల్స్, స్పామ్, నకిలీ మెసేజ్ ల నియంత్రణ చర్యలు మొదలవుతాయి. 

30 కోట్ల మందికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ లభ్యత
భారతీయ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ముందు టెక్ మహీంద్రా అభివ్రుద్ధి చేసిన టెక్నాలజీని ప్రదర్శించింది. ఇప్పటికే ఒక టెలికం సంస్థకు చెందిన 30 కోట్ల మందికి పైగా వినియోగదారులకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్ అందుబాటులో ఉంచామని తెలిపింది. అమెరికా, బ్రిటన్ టెలికం నియంత్రణ సంస్థలకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో కూడిన సేవలందించే విషయమై చర్చిస్తున్నామని టెక్ మహీంద్రా తెలిపింది.

ఐబీఎంతో వొడాఐడియా ‘ఔట్ సోర్సింగ్’ డీల్‌
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ఐబీఎంతో వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ ఐదేళ్ల కాలానికి ఐటీ ఔట్‌సోర్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విలీన ప్రక్రియలో ఐటీ సంబంధిత ఖర్చులు తగ్గించుకోవాలన్న లక్ష్యాలకు ఈ డీల్‌ దోహదపడనుందని వొడాఫోన్‌ ఐడియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఒప్పందం విలువ ఎంతనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అయితే, 70 కోట్ల డాలర్ల (సుమారు రూ.4,900 కోట్లు) స్థాయిలో ఉండవచ్చని అంచనా. 

వొడాఫోన్ ఐడియాకు ఐబీఎం హైబ్రీడ్ క్లౌడ్ ‘డిజిటల్’ ప్లాట్ ఫామ్
ఈ ఒప్పందంలో భాగంగా వొడాఫోన్‌ ఐడియాకు ఐబీ ఎం హైబ్రిడ్‌ క్లౌడ్‌ ఆధారిత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను సమకూర్చనుంది. ఈ వేదిక ద్వారా వొడాఐడియా తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించేందుకు అవకాశం లభించనుంది. అలాగే, వ్యాపార సామర్థ్యాన్ని, స్థాయిని, క్రియాశీలతను పెంచుకోవడానికి, వ్యాపార ప్రక్రియను సరళీకరించుకోవడానికి దోహదపడనుందని సంస్థ పేర్కొంది.