ఎయిర్‌టెల్-ఫిక్కీ: మహిళల సేఫ్టీ కోసం ‘మై సర్కిల్’ యాప్
భారతీ ఎయిర్‌టెల్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) సంయుక్తంగా మహిళల భద్రత కోసం ‘మై సర్కిల్’ పేరుతో ఒక ప్రత్యేక యాప్‌ను ప్రారంభించాయి.
ముంబై: భారతీ ఎయిర్‌టెల్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) సంయుక్తంగా మహిళల భద్రత కోసం ‘మై సర్కిల్’ పేరుతో ఒక ప్రత్యేక యాప్‌ను ప్రారంభించాయి. మహిళలకు అత్యవసర సందర్భాలు, ఒత్తిడి సమయంలో ఉపకరించే ఈ యాప్‌ను కేవలం ఎయిర్‌టెల్ యూజర్లే కాకుండా ఇతర టెలికం యూజర్లు కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ యాప్ సాయంతో తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, హిందీ సహా 13 భాషల్లో కుటుంబసభ్యులు లేదా స్నేహితుల్లో ఐదుగురికి ఎస్ఓఎస్ అలర్ట్స్‌ను పంపవచ్చు. దీంతో తాము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, తమను చేరుకోవాలనే సందేశాన్ని వెళుతుందని ఎయిర్‌టెల్-ఎఫ్ఎల్ఓ పేర్కొంది.
గూగుల్ ప్లేస్టోర్ తోపాటు యాపిల్ ఐవోఎస్ స్టోర్‌లో కూడా మై సర్కిల్ యాప్ అందుబాటులో ఉందని వెల్లడించింది. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ గ్లోబల్ సీఐఓ, డిజిటల్ హెడ్ హర్మీనా మెహతా మాట్లాడుతూ.. మహిళలకు సురక్షితమైన వాతారణాన్ని కల్పించేందుకే ఈ యాప్ రూపొందించినట్లు తెలిపారు.
మహిళల సాధికారత కోసం తాము కృషి చేస్తున్నామని, టెక్నాలజీని ఉపయోగించి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటనే సాయం అందించేందుకు ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. కాగా, మై సర్కిల్ యాప్‌ను ఎయిర్‌టెల్ ఎక్స్ ల్యాబ్స్ అభివృద్ధి చేయగా, కేవలం మహిళల బృందం మాత్రమే దీని కార్యకలపాల నిర్వహణను రూపొందించింది.