న్యూఢిల్లీ: భారతదేశంలోని టెలికం రంగంలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొన్నదని వొడాఫోన్‌ ఐడియా సీఈఓ బాలేష్‌ శర్మ అన్నారు. విషయానికొస్తే దేశీయ టెలికం రంగంలో ప్రస్తుతం మూడు ప్రైవేట్‌ కంపెనీలుండటం ఐడియల్ అని వొడాఫోన్‌ ఐడియా సీఈఓ బాలేష్‌ శర్మ అన్నారు. 

నో చాన్స్ ఫర్ మార్కెట్ కార్టలైజేషన్
విలీనాలు, అంతర్దానాలతో టెలికం రంగంలో మార్కె‌ట్‌ కార్టలైజేషన్‌, ద్విధాధిపత్య అవకాశాలను వొడాఫోన్‌ ఐడియా సీఈఓ బాలేష్‌ శర్మ తోసిపుచ్చారు. ‘ప్రస్తుతం టెలికం మార్కెట్లో మూడు ప్రైవేట్‌, ఒక ప్రభుత్వ రంగ కంపెనీ (బీఎస్ఎన్‌ఎల్‌ లేదా ఎంటీఎన్‌ఎల్‌) కలిపి మొత్తం నలుగురు ఆపరేటర్లు సేవలందిస్తున్నారు. నలుగురి మధ్య పోటీ ఆదర్శకంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది’ అని బాలేష్‌ శర్మ పేర్కొన్నారు. 

మూడు సంస్థల మధ్య పోటీ ఆరోగ్యకరమే
ప్రపంచంలో ఎక్కడ చూసినా మూడు ప్రైవేట్‌ కంపెనీలు ఉన్న మార్కెట్లో వాటి మధ్య ఆధిపత్య పోరు కొనసాగినప్పటికీ పోటీ ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. మూడేళ్ల క్రితం రిలయన్స్‌ జియో రంగ ప్రవేశంతో దేశీయ టెలికాం రంగంలో పోటీ మరింత తీవ్రతరమైంది. ఆ పరిణామం దేశంలోని టెలికాం కంపెనీల మధ్య విలీనాలకు తెరలేపింది. 

ఎయిర్ టెల్‌లో టెలీనార్, టాటా టెలీ విలీనం
టెలికం రంగంలో పోటీకి తట్టుకోలేక పలు చిన్న కంపెనీలు బడా కంపెనీల్లో విలీనమయ్యాయి. నార్వేకు చెందిన టెలినార్‌ను, ఆ తర్వాత టాటా టెలీ కన్స్యూమర్‌ మొబైల్‌ వ్యాపారాన్నిభారతీ ఎయిర్‌టెల్‌ తనలో విలీనం చేసుకుంది. 

ఒక్కటైన వొడాఫోన్, ఐడియా సెల్యూలార్
గత ఏడాది వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు ఒక్కటయ్యాయి. తద్వారా దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది. జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలకు గట్టిపోటీనిచ్చేందుకు కంపెనీ రూ.25,000 కోట్ల నిధుల సేకరించే పనిలో ఉంది.

విమానాల్లో సేవలకు జియో అప్లికేషన్
విమానాల్లో సెల్‌ఫోన్‌ సేవలు అందించేందుకు రిలయన్స్‌ జియో కూడా టెలికం శాఖకు దరఖాస్తు చేసుకుంది. స్థానిక, అంతర్జాతీయ విమానయాన సంస్థల విమానాలు దేశీయ పరిధిలో వెళ్తున్నప్పుడు కాల్‌, డేటా సేవలందించేందుకు అనుమతి రావడంతో, పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి.

విమానాల్లో సేవల కోసం ఎయిర్ టెల్, టాటా నెట్ ఇలా
ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్‌, హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా, టాటానెట్‌ సర్వీసెస్‌ (నెల్కో అనుబంధ సంస్థ), ఆర్టస్‌ కమ్యూనికేషన్స్‌, స్టేషన్‌ శాట్‌కామ్‌, క్లౌడ్‌కాస్ట్‌ డిజిటల్‌ వంటి సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. 

టాటా నెట్, ఎయిర్ టెల్ తదితర సంస్థలకు అనుమతులు
విమానాల్లో సర్వీసుల కోసం హ్యూస్‌ కమ్యూనికేషన్స్‌, టాటానెట్‌, భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ సంస్థ ఇండో టెలిపోర్ట్స్‌కు లైసెన్సులు లభించాయి కూడా. 2017లో ప్రయాణ సమయంలోనూ 7400 విమానాల్లో టెలికాం సేవలు అందించాయి. 2027 నాటికి 23 వేల విమానాల్లో ప్రపంచ వ్యాప్తంగా టెలికం సేవలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.