రాజధానికి కొత్త నిర్వచనం... హార్స్ లీ హిల్స్, అరకు నుండి జగన్..: సోమిరెడ్డి సెటైర్లు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. ముఖ్యంగా రాజధాని విషయంలో జగన్ చేసిన కామెంట్స్ పై సైటర్లు విసిరారు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంశంపై గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడిన మాటలపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికన స్పందించిన ఆయన జగన్ పై సెటైర్లు విసిరారు.
''రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని వైఎస్ జగన్ చెబుతున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అంబేద్కర్ పొరపాటు చేశారేమో. దీనిని ఫస్ట్ టైం జగనే గుర్తించినట్టున్నారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధానంట. ఆయన వెనుకే అధికార యంత్రాంగమంతా పెట్టేబేడా సర్దుకుని పోయి గుడారాలేసుకుంటే సరిపోద్ది.'' అంటూ సోమిరెడ్డి జగన్ పై విరుచుకుపడ్డారు.
read more మండలి పరిణామాలు... కులాల మధ్య చిచ్చుకు చంద్రబాబు యత్నం: డిప్యూటీ సీఎం
''మొత్తానికి రాజధానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు.ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లుగా పాలించిన వారికి లేకపోయింది. జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారంటున్నారు. మన రాష్ట్రంలో కూడా హార్స్ లీ హిల్స్, అరకు లాంటి ప్రాంతాలున్నాయి కదా..అక్కడి నుంచి కూడా పాలన సాగించుకోవచ్చు'' అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై కూడా సోమిరెడ్డి స్పందించారు. ''అసెంబ్లీ, శాసన మండలిలో మంత్రులు,వైసీపీ ఎమ్మెల్యేల తీరు చట్టసభలకే మచ్చ తెస్తోంది. మెజార్టీ సభ్యుల కోరిక మేరకు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే విచక్షణాధికారం చైర్మన్ కి ఉందనే విషయం తెలిసి కూడా షరీఫ్ గారితో వైసీపీ సభ్యుల తీరు,వాడిన భాష బాధాకరం. క్షమించరానిది.తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని అన్నారు.