వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు నిరాకరణ: బీజేపీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీకి షాక్ తగిలింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆ పార్టీని వీడారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆదివారం నాడు బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో వరప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరప్రసాద్ కు వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు ఇవ్వలేదు. దీంతో వరప్రసాద్ వైఎస్ఆర్‌సీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల క్రితం వరప్రసాద్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిశారు.
2014 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా వరప్రసాద్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ స్థానం నుండి వరప్రసాద్ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు.2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ నుండి తిరుపతి ఎంపీగా పోటీ చేసి వరప్రసాద్ ఓటమి చెందారు.
అయితే ఈ దఫా వరప్రసాద్ కు వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు కేటాయించలేదు. దరిమిలా వరప్రసాద్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. బీజేపీ నాయకత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో వరప్రసాద్ ఇవాళ బీజేపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. సీపీఐ, సీపీఐ(ఎం),కాంగ్రెస్ పార్టీలు మరో కూటమిగా బరిలోకి దిగనున్నాయి.