నెల్లూరు:  వెంకటాచలం ఎండిఓ తనపై కేసు పెట్టడం వెనుక సూత్రధారులు వేరే వాళ్లు ఉన్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఆదివారం నాడు తెల్లవారుజామున  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

శ్రీకాంత్ రెడ్డి లేఅవుట్ కు సంబంధించి నీటి సరఫరా విషయమై తాను రెండు దఫాలు ఎండీఓతో మాట్లాడిన విషయాన్ని శ్రీధర్ రెడ్డి ఒప్పుకొన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే  కాకాణి గోవర్ధన్ రెడ్డి నీటి సరఫరా ఇవ్వకూడదని చెప్పారని ఎండిఓ సరళ తనతో చెప్పారని శ్రీధర్ రెడ్డి చెప్పారు.

అయితే ఈ విషయమై తాను కాకాణి గోవర్ధన్ రెడ్డితో మాట్లాడితే ఈ విషయంలో వేరే సమస్యలు ఉన్నాయని వాటిపై తర్వాత మాట్లాడుతానని చెప్పాడని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాకు చెప్పారు.

ఈ కేసులో సూత్రధారులు వేరేవాళ్లు ఉన్నారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఎండీఓ సరళ కేవలం పాత్రధారులేనని ఆయన చెప్పారు. పోలీసులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేయడంపై శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఈ కేసులో విచారణ  చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని శ్రీదర్ రెడ్డి విశ్వాసంతో ఉన్నారు.  ఎండిఓ ఇంటిపై దాడి చేయలేదని ఆయన చెప్పారు. పోలీసుల విచారణలో అన్నీ విషయాలు బయటకు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.