నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై జిల్లా పోలీసు అధికారుల సంఘ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పోలీసులపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు.

మాజీ స్పీకర్, దివంగత నేత కోడెల శివప్రసాదరావు సంతాప సభలో చంద్రబాబు నాయుడు పోలీసులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయన్నారు.  

కొంతకాలంగా ప్రజలను రెచ్చగొట్టి పోలీసులపై ఉసిగొల్పేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నారు. పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నిబంధనలకు లోబడి చట్టపరిధిలో నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. 

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు పనితీరును పొగిడి ప్రభుత్వం మారిన తర్వాత పోలీసుల తీరును తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. 

చంద్రబాబు కుటుంబానికి రక్షణ కల్పిస్తోంది పోలీసులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికైనా చంద్రబాబు పద్ధతి మార్చుకొని హుందాగా వ్యహరించాలని కోరారు. మరోసారి పోలీసులను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.