నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రమ్య అనే యువతి ఆత్మహత్య కేసులో నిందితుడు శివభార్గవ్ కోసం వేదాయపాళెం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. సెల్ఫీ వీడియో వాట్సప్ లో పెట్టి రమ్య అనే యువతి నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

రమ్య ఆత్మహత్య చేసుకున్న సమయంలో యువతి ప్రియుడు శివభార్గవ్ స్నేహితులతో కలిసి వారి వారి ఇంటికి సమీపంలోని ఓ కళాశాల మైదానంలో క్రికెట్ ఆడినట్లు, ఆ తర్వాత పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

శివభార్గవ్ మిత్రులను అదుపులోకి తీసుకుని అతని ఆచూకీ కోసం పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారంనాడు కుటుంబ సభ్యులను, బంధువులను కూడా విచారించారు. 

రమ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుంటూ వీడియోను లైవ్ రికార్డు చేసింది. ఆ లైవ్ వీడియోను తన ప్రియుడు శివభార్గవ్ కు వాట్సప్ చేసింది. ఆత్మహత్యకు ముందు రమ్య శివభార్గవ్ తో చాటింగ్ చేసింది. తనతో మాట్లాడాలని వేడుకుంది. శివభార్గవ్ మోసం చేయడం వల్లనే రమ్య ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.