తీవ్ర అసంతృప్తి: జగన్ మీద వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద సొంత వైసీపీ ఎమ్మెల్యే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తిట్టినవాళ్లకు జగన్ మంత్రి పదవులు ఇచ్చారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న తనలాంటి వాళ్లను పక్కన పెట్టారని ఆయన అన్నారు.
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద ఆయనకు తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు ఆ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
తిట్టినవారికే వైఎస్ జగన్ మంత్రి పదవులు ఇచ్చారని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు పార్టీలో మొదటి నుంచి ఉన్న తనను పక్కన పెట్టారని ఆయన అన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు తన వద్దకు వచ్చిన ప్రజలతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఆ సందర్బంగా ఆయన వైఎస్ జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ ను ఉరి తీయాలంటూ ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి అన్నారని ఆయన గుర్తు చేసారు. అయినా కూడా జగన్ వారిని పార్టీలో చేర్చుకున్నారని ఆయన అన్నారు.
అంతేకాకుండా వైఎస్ జగన్ తల్లి విజయమ్మను బొత్స సత్యనారాయణ విజయ అని సంబోధించారని కూడా ఆయన గుర్తు చేశారు. పార్టీలోకి ముందు వచ్చినవారిని కాదని వెనక వచ్చినవారికి జగన్ మంత్రి పదవులు ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు టీవీ చానెళ్లలో రావడంతో వైసీపీలో తీవ్రమైన కలకలం చోటు చేసుకుంది. ప్రసన్నకుమార్ రెడ్డి చాలా కాలంగా మౌనంగా ఉన్నారు. ఇన్నాళ్లకు ఆయన తన అసంతృప్తిని బయటకు చెప్పారని అంటున్నారు.