నెల్లూరు: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా కామాంధుల చేతిలో చిన్నారులు, మహిళలు నలిగిపోతూనే వున్నారు. కంచె చేనును మేసిన విధంగా చిన్నారులను కాపాడాల్సిన వారే వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్న అనేక దుర్ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని ఓ గిరిజన గ్రామమైన తుమ్మలతలుపులో చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ ఎనిమిదేళ్ల గిరిజన బాలికకు మాయమాటలు చెప్పి సొంతమేనమామే పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు నిలదీయగా తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి బాలిక బయటపెట్టింది. 

దీంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.