నెల్లూరు: సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఏపి విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు గత ఏడాది కాలంగానే సంక్షేమఫలాలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తున్నారని వెల్లడించారు. 

బుధవారం నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ పర్యటించారు. నెల్లూరు పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ''జగనన్న చేదోడు'' పథకం ప్రారంభం కోసం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని లబ్దిదారుల ఖాతాలలో నగదును జమచేశారు.   

read more  ఏపీ చరిత్రలోనే రికార్డు... వారి ఖాతాల్లో రూ. 42,465కోట్లు: వైఎస్ జగన్

ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబుచ, లోకేష్ లపై మంత్రి మండిపడ్డారు. మూడు నెలల పాటు హైదరాబాద్ లో కూర్చుని ఇప్పుడు ఉత్తర పలుకులు పలుకుతున్న లోకేష్ గతంలో ఏం చేశారు గుర్తు తెచ్చుకోవాలన్నారు. లోకేష్ సత్తా ఏంటో చంద్రబాబు తెలుసు అందుకే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సైతం వెనుకాడుతున్నారని అనిల్ యాదవ్ తెలిపారు.  

గత ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు 23 ఎమ్మెల్యే సీట్లు. అలాంటి టిడిపి నాయకులు ఇప్పుడు తమ ప్రభుత్వ గురించి గొప్పలు చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించే ధైర్యం చంద్రబాబుకు ఉందా లేదో చెప్పాలని మంత్రి అనీల్ డిమాండ్ చేశారు.