ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. కానీ... వారి కులాలు వేరు కావడంతో వారి ప్రేమకు పెద్దలు అడ్డుగా నిలిచారు. తోడబుట్టిన తమ్ముడిని అన్న అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...కోయంబత్తూరు మేట్టుపాళయంకు చెందిన కరుప్పుస్వామికి వినోద్‌ (25), కనకరాజ్‌ (22), కార్తిక్‌ (19) అనే ముగ్గురు కుమారులున్నారు. కూరగాయల మార్కెట్‌లో కూలీగా పనిచేస్తున్న కనకరాజ్‌ అదే ప్రాంతానికి చెందిన మూర్తి కుమార్తె వర్షిణిప్రియ (16) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో వారి ప్రేమను ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. దీంతో... వారు పెద్దలను ఎదురించి సహజీవనం మొదలుపెట్టారు.  దీంతో... ఆగ్రహంతో ఊగిపోయిన వినోద్...మంగళవారం సాయంత్రం కనకరాజ్‌ ఇంటికి వెళ్లి వర్షిణిప్రియను పెళ్లిచేసుకోవడానికి వీల్లేదని చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుని తీవ్రస్థాయికి చేరుకుంది.

ఈ సమయంలో వినోద్‌ తన వెంట తెచ్చుకుని వేటకత్తితో తమ్ముడు కనకరాజ్‌పై దాడిచేయగా సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అడ్డుపడిన వర్షిణి తీవ్రంగా గాయపడి విషమపరిస్థితిలో ఆçస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు వినోద్‌ బుధవారం ఉదయం మేట్టుపాళయం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.