లక్నో: బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేసినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి కర్రలతో విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోహైల్(23) అనే యువకుడు ఖైరీదికోలీ గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలోనే అర్థరాత్రి అతడు బంధువల ఇంటిబయటే మూత్ర విసర్జన చేశాడు. అయితే మహిళలు, చిన్నపిల్లలు వుండే చోట ఇలా ఆరుబయట మూత్రం ఎలా పోస్తావంటూ చుట్టుపక్కల ఇళ్లలో వుండే రామ్‌మూరత్‌, ఆత్మారామ్‌, రాంపాల్‌, మంజీత్‌ లు అతడిని నిలదీశారు. 

ఈ క్రమంలోనే వీరు యువకుడితో గొడవకు దిగారు. మాటా మాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వీరు ఇంట్లోంచి కర్రలను తీసుకువచ్చి యువకుడిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై సోహైల్ కుప్పకూలగా బంధువులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందాడు. 

మృతుడి బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడిచేసిన వారిని అరెస్ట్ చేశారు. యువకుడిపై దాడి చేసిన మరికొందరు పరారీలో వున్నారని... వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.