జ్యోతిష్యం, న్యూమరాలజీ, వాస్తు వంటి అంశాలను మన చుట్టూ వున్న వారిలో ఎందరో ఫాలో అవుతారు. దీనికి రాజకీయ నేతలు,  ప్రముఖులు సైతం అతీతులు కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటువంటి వాటిని బాగా నమ్ముతారు. ముహూర్తం చూడకుండా ఆయన అడుగు తీసి అడుగు కూడా బయటపెట్టరు.

ఇక కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి యడ్యూరప్ప న్యూమరాలజీని బాగా ఫాలో అవుతారు. ఇప్పటి వరకు ఆయన మూడుసార్లు సీఎం పదవి చేపట్టినప్పటికీ పూర్తికాలం సీఎంగా కొనసాగలేదు.

తాజాగా మరోసారి ఆయన తన పేరులో స్వల్పమార్పులు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన పేరు బీఎస్ యడ్యూరప్ప (BS YADDYURAPPA) అని ఉండగా దానిని (BS YADIYURAPPA)గా మార్చుకున్నారు.

అంతకుముందు 2007లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన (BS YEDIYURAPPA)ను (BS YEDDYURAPPA)గా మార్చుకున్నారు. రాజకీయంగా ఆ సమయంలో కాస్త గడ్డుకాలాన్ని ఎదుర్కోవడంతో జ్యోతిష్యుడి సలహా ప్రకారం పేరులో అక్షరాలను మార్పు చేసుకున్నారు.

కానీ.. అది సరిగా వర్కవుట్ కాలేదని భావించిన యడ్యూరప్ప.. మరోసారి పేరులో మార్పు చేశారు. తాజాగా శుక్రవారం గవర్నర్ వాజూభాయ్ వాలాకిచ్చిన లేఖలో తన పేరును తిరిగి యడియూరప్ప అనే పేర్కొన్నారు. మరి ఈసారైనా ఆయన పూర్తికాలం పదవిలో ఉంటారా లేదా అన్నది వేచి చూడాలి.