దాదాపు అర్థశతాబ్ధం క్రితం గల్లంతైన భారత వాయుసేన విమాన శకలాలను రక్షణ శాఖ అధికారులు హిమాచల్‌ప్రదేశ్‌లో గుర్తించారు. ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్-12-534 విమానం 1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణ శాఖ సిబ్బందితో ఛండీగఢ్ నుంచి లేహ్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరింది.

మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా... వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లీంచాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పైలట్‌కు సమాచారం అందించారు.

సిబ్బంది ఆదేశాల మేరకు పైలట్ విమానాన్ని తిరిగి ఛండీగఢ్‌కు మళ్లీంచారు. అయితే మార్గమధ్యంలోనే రోహ్తంగ్ పాస్ మీదుగా వెళుతుండగా విమానానికి కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి.

గల్లంతైన విమానం కోసం రక్షణ శాఖ కొన్ని నెలల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది.. కానీ ఫలితం మాత్రం శూన్యం. అయితే 35 ఏళ్ల తర్వాత 2003లో ఈ విమానంలో ప్రయాణించిన సైనికుడు బేలీరామ్ మృతదేహాన్ని మౌంటనేరింగ్ ఇనిస్టిట్యూట్ సభ్యులు గుర్తించారు.

దీని ఆధారంగా ఆ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టడంతో మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. అయితే 2009 నుంచి ఈ గాలింపు చర్యలను నిలిపివేశారు. ఈ క్రమంలో గతేడాది జూలైలో విమానానికి సంబంధించిన కొన్ని శకలాలు ఢాకా గ్లేషియర్‌లో పడినట్లు వార్తలు రావడంతో ఆర్మీ, వాయుసేన సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం విమానానికి సంబంధించిన ఏరో ఇంజిన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఇంధన ట్యాంక్ యూనిట్, కాక్‌పిట్ డోర్ తదితర భాగాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 98 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ప్రమాదాన్ని.. భారతీయ వాయుసేన చరిత్రలో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటిగా చెబుతారు.