భర్త మరో స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

స్థానిక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుట్లుపూర్‌ గ్రామానికి చెందిన పాన్‌ దేవీ అనే మహిళ భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇది తెలిసిన పాన్ దేవి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇన్నేళ్లు కాపురం చేసిన భర్త మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడం తట్టుకోలేకపోయింది. 

ఈ క్రమంలో ఇంట్లో నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. పాన్ దేవి కనిపించడం లేదని ఇంట్లో వాళ్లు కంగారు పడుతున్నారు. పాన్ దేవి దగ్గరిలోని రామ్‌గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. నదిలో తేలియాడుతున్న ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే తమ కూతురు మృతికి భర్త వివాహేతర సంబంధమే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు మృతురాలి భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.