ప్రియుడి జల్సాల కోసం డబ్బు లేకపోవడంతో... పోలీసు కావాల్సిన ఆమె.. దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టింది. చివరకు పోలీసులకు చిక్కింది.
ఆమెకు జీవితంలో పెద్ద పోలీసు అధికారి కావాలనేది ఆమె కళ. దాని కోసం చాలా కష్టపడింది. ఇటీవలే తమిళనాడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఎంపికైంది. కానీ.. ప్రియుడి కోసం ఆమె దారి తప్పడం గమనార్హం. ప్రియుడి జల్సాల కోసం డబ్బు లేకపోవడంతో... పోలీసు కావాల్సిన ఆమె.. దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టింది. చివరకు పోలీసులకు చిక్కింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విల్లుపురం జిల్లా సెంజి ఆలంపూండి గ్రామానికి చెందిన మాధవి (42) పుదుచ్చేరిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఈమె పుదుచ్చేరి టీఆర్ నగర్‌లోని లేడీస్ హాస్టల్ ఉంటూ ప్రతి రోజు విధులకు హాజరవుతున్నారు. అయితే, ఈ నెల 18వ తేదీ తన బంధువుల ఇంట జరిగిన వివాహానికి 12 సవర్ల నగలు వెసుకుని వెళ్ళి వచ్చి, మరుసటి రోజు ఆ నగలను తన గదిలోని లాకర్‌లో భద్రపరిచి విధులకు వెళ్ళారు.
సాయంత్రం వచ్చి చూడగా నగలు కనిపించకపోవడంతో ఉరులైయన్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, మాధవి గది పక్కనే ఉండే శివప్రతీక (21) అనే యువతి ప్రవరనపై సందేహించి ఆమెను విచారించారు. ఆమె గదిలో గాలించి పది సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రెండు సవర్ల నగలను విక్రయించగా వచ్చిన డబ్బును తన ప్రియుడితో కలిసి జల్సాలకు ఖర్చు చేసింది.
దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విచారణలో శివప్రతిక తమిళనాడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైనట్టు తెలిసింది. అంతేకాకుండా, పుదుచ్చేరి పోలీస్ శాఖ నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులై ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
