వదిన( అన్న భార్య) అంటే తల్లితో సమానంగా చూస్తాం. అలాంటి వదినపై ఓ మరిది కన్నేశాడు. తన శారీరక కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో...ఆమె ఒంటికి నిప్పు అంటించాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హరికిషన్ పూర్ కి చెందిన మహిళకు 2016లో వివాహం అయ్యింది. పెళ్లి జరిగిన నాటినుంచి ఆమె పట్ల మరిది అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని ఆమె ఒకసారి తన భర్త వద్ద ప్రస్తావించింది. దానిని సీరియస్ గా తీసుకోని ఆమె భర్త... తన తమ్ముడికే మద్దతుగా నిలిచాడు. దీంతో... అప్పటి నుంచి ఆమె కొంచెం మరిది కి దూరంగా ఉంటూ వస్తోంది.

తాజాగా.. తన శారీరిక కోరిక తీర్చాలంటూ... ఆమెను మరిది వేధించాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. దాదాపు 80శాతం గాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాలతో బటయపడినప్పటికీ... గాయాల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. 

ఆమె కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.