భర్త చనిపోయాడు.. ఈ విషయం ఆమెకు అర్థమయ్యిందో, లేదో.. కానీ అతని మృతదేహం పక్కనే అలాగే కూర్చుని ఉంది. అలా గంటా, రెండు గంటలు కాదు.. ఏకంగా రెండు రోజులు కూర్చుంది. చివరికి కొడుకు ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
చెన్నై : Chennai పురసైవాక్కంలో తాళం వేసిన ఇంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న భర్త deadbodyతో భార్య రెండు రోజులు గడిపిన ఘటన సంచలనం కలిగించింది. చెన్నై పురసైవాక్కం వైకోకారన్ వీధికి చెందిన అశోక్ బాబు (53). ఇతను అంబూరులోని లెదర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య పద్మిని (48), కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమై చెన్నై నుంగంబాక్కంలో ఉంటుంది, కుమారుడు బెంగళూరులో పని చేస్తున్నాడు, కాగా, పద్మిని 2011 నుంచి Mental disorderకు చికిత్స పొందినట్లు తెలిసింది. అశోక్ బాబు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
అశోక్ బాబు కొడుకు ఈ నెల 22న ఇంటికి ఫోన్ చేయగా ఎవరూ తీయలేదు దీంతో సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూశాడు.లోపల తలుపు వేసి వేసి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా అశోక్ బాబు మృతి చెంది ఉన్నాడు. అతని మృతదేహం కుళ్ళిన స్థితిలో పడి ఉంది. అతని పక్కనే పద్మిని కూర్చుని ఉంది. పోలీసులు అశోక్బాబు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే మే 21న లక్నోలో వెలుగు చూసింది. Lucknowకు చెందిన Ankita Dixit అనే 26 ఏళ్ల అమ్మాయి 10 రోజులకు పైగా తన తల్లి శవాన్ని పక్క గదిలోనే ఉంచుకుని ఇంట్లోనే ఉన్నట్లు police గుర్తించారు. ఆమె తల్లి చనిపోయినట్లుగా లక్నో పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. కనీసం తన తల్లి చనిపోయిందన్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు. వివరాల్లోకి వెడితే.. లక్నోలోని ఇందిరా నగర్‌లో ఓ అమ్మాయి తన తల్లి శవంతో 10 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉంది. ఆ యువతిని 26 ఏళ్ల అంకితా దీక్షిత్‌గా గుర్తించారు. ఆమె ఒక గదిలో ఉండగా, ఆమె తల్లి corpse మరో గదిలో పడి ఉంది. అయితే తల్లి చనిపోయిన విషయాన్ని ఆమె చుట్టుపక్కల వారికి కానీ, బంధువులకు కానీ చెప్పలేదు.
ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న లక్నో పోలీసులు అంకితా దీక్షిత్ ఉన్న గది పక్కగదిలో మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను అంకితా తల్లి సునీతా దీక్షిత్ గా గుర్తించారు. సునీతా దీక్షిత్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో పనిచేసి పదవీ విరమణ పొందింది. ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇరుగుపొరుగు సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులకు అంకితా ఇంట్లో వెళ్లగానే.. ప్రధాన తలుపుకు తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. అయితే లోపలినుంచి ఒక స్త్రీ గొంతు వినిపించింది. వారు తలుపు తట్టగా, మృతురాలి కుమార్తె 26 ఏళ్ల అంకిత దీక్షిత్ వారిని లోపలికి రాకుండా డోర్ తెరవకపోవడమే కాకుండా.. నిరసన ప్రారంభించింది. ఎంత సేపు నచ్చచెప్పినా ఆమె వినకపోవడంతో.. పోలీసులకు మరో మార్గం కనిపించలేదు. దీంతో పోలీసులు కార్పెంటర్‌ను పిలిపించి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.
అక్కడి సీన్ చూసిన వారు షాక్ కు గురయ్యారు. అంకిత ఒక గదిలో, ఆమె తల్లి మరో గదిలో పడుకుని ఉండడం గమనించారు. అంకిత మానసిక పరిస్థితి బాగా లేదని అక్కడి పరిస్థితిని బట్టి వారికి అర్థమయ్యింది. మొదట గదిలో ఉన్న యువతిని చూసి పోలీసులు కంగుతిన్నారు. అమ్మాయి ఎక్కువగా మాట్లాడలేకపోతోంది. కొన్ని ప్రశ్నలు వేసిన తరువాత ఆమె ఇచ్చిన అరకొరా సమాధానాలతో ఆమె మరణించిన వ్యక్తి కుమార్తె అని తేలింది.సునీతా దీక్షిత్ చనిపోయి 10 రోజులు అయి ఉంటుందని సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత, దాని ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అయితే మహిళ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతురాలు హెచ్‌ఏఎల్ రిటైర్డ్ ఇంజనీర్ సునీత పదేళ్ల క్రితం తన భర్త రజనీష్ దీక్షిత్‌తో విడాకులు తీసుకుంది. ఆమె క్యాన్సర్‌తో పోరాడుతోంది. 26 ఏళ్ల కుమార్తెతో కలిసి ఉంటోంది.
