ఉత్తరప్రదేశ్ లోని ఓ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు కనీసం బెడ్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ మహిళ ఆస్పత్రి కారిడార్ లోనే ప్రసవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనంతా అక్కడి సీసీ కెమేరాలో రికార్డు కావడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా... ఓ గర్భిణీ స్త్రీ పట్ల.. ఆస్పత్రి యాజమాన్యం ఇంత దారుణంగా ప్రవర్తించడంపట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూకాబాద్ జిల్లాలోని రామ్ మనోహర్ లోహియా ప్రభుత్వ ఆస్పత్రికి డెలివరీ నిమిత్తం ఓ మహిళ వచ్చింది. కాగా... ఆమెకు అప్పటికే పురిటి నొప్పులు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. కనీసం ఆమెకు బెడ్ కూడా ఇవ్వలేదు. ఆస్పత్రిలో బెడ్స్ లేవంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

దీంతో సదరు మహిళ ఆస్పత్రి కారిడార్ లోనే బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది. కారిడార్ లో రక్తపు మడుగులో మహిళ పడి ఉండటం చూసి స్థానికుల గుండె పిండినట్లు అయ్యింది. స్థానిక జర్నలిస్టులు ఈ ఘటనను వెలుగులోకి తీసుకువచ్చారు. కాగా... ఈ ఘటనను సుమోటోగా తీసుకొని విచారణ చేపడుతున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ మెనికా రాణి తెలిపారు.

ఈ ఘటనకు కారకులైన వారిని కచ్చితంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సంఘటనతో ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమౌతోందని ఆయన ఆమె అన్నారు.