వాతావరణ మార్పుల కారణంగా చోటు చేసుకున్న అకాల వర్షాలను ముందుగా పసిగట్టి... నష్ట నివారణా చర్యలు చేపట్టేందుకు వీలుగా తమిళనాడు ప్రభుత్వం కీలక  నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా రాడార్లను ఏర్పాటు చేసింది.  

దేశంలోనే తొలిసారి కేంద్ర ప్రభుత్వం కాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాడార్లు (radars) ఏర్పాటుకానున్నాయి. ఇది ఎక్కడో కాదు .. మన పక్కనే వున్న తమిళనాడులో (tamilnadu). ఇందుకు కారణాలు లేకపోలేదు. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా గడిచిన పదేళ్లుగా రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసి భారీ నష్టం కలిగింది. ఇక గతేడాది ఈశాన్య రుతుపవనాలతో సాధారణం కన్నా భారీవర్షాలు కురిశాయి. దీని కారణంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్‌, కడలూరు, నాగపట్టణం తదితర జిలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అదే సమయంలో డిసెంబరు 30వ తేది కురిసిన అకాల వర్షానికి చెన్నై (chennai) నీటమునిగింది. 

దాదాపు మూడు గంటల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో 8 సెం.మీపైగా వర్షపాతం నమోదైంది. దీనిపై ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో అపార నష్టం వాటిల్లింది. రాడార్‌ సదుపాయం లేకపోవడం వల్లనే దీనికి కారణంగా అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై తమిళనాడు రాష్ట్ర విపత్తుల నిర్వహణ మంత్రి కేకేఎస్ఎస్ఆర్‌ రామచంద్రన్‌ మాట్లాడుతూ... రాడార్‌ లేకపోవడం వల్లే వర్షాన్ని అంచనా వేయలేకపోయామని, అందువల్లే ముందస్తు జాగ్రత చర్యలు చేపట్టలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో, జాతీయ సముద్ర పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో జనవరి 14వ తేది పల్లిక్కరణైలో కొత్తఎస్‌-బ్యాండ్‌ తరహా రాడార్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం నుంగంబాక్కం, శ్రీహరికోట, కారైక్కాల్‌ ప్రాంతాల్లో మూడు ఎస్‌-బ్యాండ్‌ రాడార్లు ఉన్నాయి. 

ఈ రాడార్ల ఏర్పాటుతో చెన్నై, శివారు ప్రాంతాల్లో నెలకొనే వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా గణించగలమని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం పేర్కొంది. అలాగే రాష్ట్రం మొత్తం వాతావరణ పరిస్థితులు గణించేలా రాడార్లు ఏర్పాటుచేయాలని కోరింది. దీని వల్ల వాతావరణ మార్పులను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఎప్పటికప్పుడు తెలుసుకుని తక్షణ చర్యలకు దిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. 

మరోవైపు.. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా పరిణమించి రానున్న 48 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనుందని IMD హెచ్చరించింది. గత రెండు రోజులుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మార్చి 21 నాటికి తీవ్ర తుపానుగా మారనుందని దీని ప్రభావంతో సముద్రంలో అల్లకల్లోల్లం ఏర్పడనుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. దీనికి అసానిగా నామకరణం చేశారు. అండమాన్ నికోబార్ దీవులపై దీని ప్రభావం వుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈక్రమంలో గత నాలుగు రోజులుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా..అండమాన్ నికోబార్ దీవుల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అండమాన్ యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ బృందాలు సహా కేంద్ర సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నారు. ద్వీప సమూహంలోని లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించడంతో సహా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు