రోజూ తాగొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్న భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత సంచలన నిర్ణయం తీసుకుంది. దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్యచేసింది.

వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని పుళల్ బుద్ధగరం వెంకటేశ నగర్‌ 13వ వీధికి చెందిన సురేశ్‌కు విల్లుపురానికి చెందిన అనసూయతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరికి లోకేశ్ అనే కుమారుడు ఉన్నాడు. దగ్గరలోని మాంసం దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పుళల్ పోలీస్ స్టేషన్‌కు తన భర్త చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందించింది అనసూయ.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సురేశ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కోసం చెన్నై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణలో భాగంగా అనసూయను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తన భర్త ప్రతిరోజూ మద్యం సేవించి తగదాకు దిగేవాడని, తనను శారీరకంగా.. మానసికంగా హింసించేవాడని వాపోయింది. ఇక ఓపిక నశించడంతో సమీప బంధువు మారన్‌తో కలిసి భర్తను చంపాలని నిర్ణయించుకున్నట్లు అనసూయ తెలిపింది.

ముందుగా దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో అతను స్పృహ తప్పిన తర్వాత గొంతును దుప్పట్టాతో నులిమి హతమార్చినట్లు తెలిపింది. ఆ తర్వాత మారన్ సాయంతో ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లుగా అనసూయ వెల్లడించింది. మృతుడి భార్యతో పాటు ఆమెకు సాయం చేసిన మారన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.