గోరఖ్‌పూర్: పెద్దల సమక్షంలో జరిగిన పెళ్ళి అదే పెద్దల సమక్షంలో పెటాకులయ్యింది. మూడుముళ్ల బంధంతో ఒక్కటయిన రెండు గంటల్లోనే నవదంపతులు దూరమయ్యారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... గోరఖ్ పూర్ జిల్లాలోని హెమ్చాపర్ గ్రామంలో ఓ వివాహం జరిగింది. పెళ్లి తంతు, ఆ తర్వాత బంధువులను కలవడం వంటి వాటితో అలసిపోయిన వరుడు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఒక్క సంఘటన  నవ వధూవరులను దూరం చేసింది. 

వరుడు స్పృహ తప్పడంతో అతడికి ఏదో జబ్బు వుండి వుంటుందని వధువు తరపువారు అనుమానించారు. ఇదే విషయాన్ని వరుడి తరపు వారిని నిలదీయగా ఇరు కుటుంబాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలోనే ఇద్దరి తరపు పెద్దల మధ్య రెండు గంటలపాటు పంచాయతీ జరిగింది. అయినా ఇరు వర్గాల మధ్య రాజీ కుదరకపోవడంతో ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. 

ఇలా రెండు గంటలకే వివాహం కాస్తా పెటాకులైంది. దీంతో పెళ్ళికి వచ్చినవారంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.