సెల్ఫీ మోజులో వింత వింత సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోయిన వారిని ఇప్పటి వరకు చాలా మందిని చూశాం. అయితే... ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని అనుకున్న ఓ వ్యక్తి చివరగా తీసుకున్న ఓ సెల్ఫీ అతని ప్రాణాలు కాపాడింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కొట్టాయం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కొంతకాలం క్రితం వివాహమైంది. అయితే.. కొద్ది రోజులుగా భార్యతో అతనికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురై ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని రైల్వే ట్రాక్‌పై పడుకుని సెల్ఫీ దిగి నేను చనిపోవాలనుకుంటున్నాను అని ఫ్రెండ్స్ కి ఆ సెల్ఫీ పంపించాడు.

అతను ఎక్కడ చనిపోవాలనుకుంటున్నాడో... అతను తీసుకున్న సెల్ఫీ ద్వారా అతని స్నేహితులు గుర్తించారు. అతను పంపిన సెల్ఫీలో రైల్వేకు చెందిన పసుపు రంగులోని మైలు రాయి ఒకటి వారికి కనపడింది. వెంటనే వారి మిత్రుల్లో ఒకరు రైల్వే అధికారుల వద్దకు వెళ్లి సమాచారం అందించగా ఆ మైలు రాయి ప్రదేశాన్ని గుర్తించారు. 

ఆ మార్గంలో వెళ్లే రైళ్లను నిదానంగా వెళ్లాలని సూచించి అతన్ని సురక్షితంగా కాపాడారు. అనంతరం రైల్వే పోలీసులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయబోమని హామీ ప్రతం రాయించుకొని తర్వాత ఇంటికి పంపించారు.