న్యూఢిల్లీ:భారత్, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. బెకా ఒప్పందం (బేసిక్ ఎక్స్చేంచ్, కో ఆపరేషన్ అగ్రిమెంట్)  పై రెండు దేశాల ప్రతినిధులు మంగళవారం నాడు సంతకాలు చేశాయి. 

రెండు దేశాలకు చెందిన  ప్రతినిధులు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్, ఎస్పర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోలు  ఢిల్లీలోని హైద్రాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు.

సైనిక లాజిస్టిక్స్ మార్పిడి, సురక్షిత సమాచార మార్పిడిని ప్రారంభించడానికి ఇరు దేశాలు ఇప్పటికే జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ (2002), లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (2016),కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ (2018) పై సంతకం చేశాయి.

భారతదేశానికి వర్గీకృత భౌగోళిక-ప్రాదేశిక డేటాతో పాటు ముఖ్యమైన సైనిక అనువర్తనాలను కలిగి ఉన్న క్లిష్టమైన సమాచార మార్పిడి చేయనుంది.రెండు దేశాలు మ్యాప్ లు, నాటికలు, ఏరో నాటికల్ చార్టులు, వాణిజ్య ఇతర వర్గీకరించని చిత్రాలు, భౌగోళిక భూ అయస్కాంత గురుత్వాకర్షణ డేటాను మార్పిడి చేసుకోవచ్చు.

ఈ ఒప్పందం అమెరికాకు సున్నితమైన ఉపగ్రహం, సెన్సార్ డేటాను పంచుకొనేందుకు వీలు కల్పిస్తోంది.బెకా ఒప్పందాన్ని పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.  సమాచార మార్పడికి ఇది సరికొత్త మార్గాలను తెరిచిందన్నారు.

ఇతర విషయాలపై చర్చించేందుకు భారత్ సిద్దంగా ఉందన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి అభివృద్ది చెందే అవకాశం ఈ ఒప్పందం ద్వారా లభించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పాంపియో చెప్పారు.