హిజాబ్ వివాదంపై భోపాల్ బీజేపీ (bjp) ఎంపీ సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ (pragya singh thakur0 సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థల్లో యువతులు, బాలికలు హిజాబ్ ధరించడంపై ప్రగ్యా ఠాకూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో (karnataka) రాజుకున్న హిజాబ్ (hijab) వ్యవహారం ఇప్పుడు దేశం మొత్తం వ్యాపించిన సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో హిజాబ్ వివాదంపై భోపాల్ బీజేపీ (bjp) ఎంపీ సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ (pragya singh thakur) సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థల్లో యువతులు, బాలికలు హిజాబ్ ధరించడంపై ప్రగ్యా ఠాకూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఇళ్లలో హిజాబ్ ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు స్కూల్‌కి వెళ్లేటప్పుడు స్కూల్ యూనిఫాం ధరించి విద్యా సంస్థల క్రమశిక్షణ పాటించాలని ప్రగ్యాసింగ్ పేర్కొన్నారు. గురుకుల శిష్యులు కాషాయ కండువా ధరిస్తుంటారని ఆమె గుర్తుచేశారు.
హిజాబ్ నెరిసిన వెంట్రుకలను దాచుకోవడానికి ఉపయోగిస్తారని ప్రగ్యాసింగ్ ఠాకూర్ పేర్కొన్నారు.‘‘హిజాబ్ ఒక పర్దా. మిమ్మల్ని చెడు దృష్టితో చూసే వారిపై పర్దాను ఉపయోగించాలి. కానీ హిందువులు స్త్రీలను పూజించినందున వారిని చెడు దృష్టితో చూడరు’’ అని ప్రగ్యాసింగ్ వ్యాఖ్యానించారు. స్త్రీల స్థానానికి ప్రాధాన్యం ఉన్న ఈ దేశంలో హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదు అని ఆమె అన్నారు. మదర్సాలలో హిజాబ్ ధరించండి, అంతేకానీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల క్రమశిక్షణకు భంగం కలిగిస్తే.. దానిని సహించేది లేదు అని ప్రగ్యా సింగ్ హెచ్చరించారు.
అంతకుముందు హిజాబ్ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (uttar pradesh cm) యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హిజాబ్ వివాదంపై యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఏ ముస్లీం మహిళ హిజాబ్ ను ఇష్టానుసారంగా ధరించదనీ, హిజాబ్‌ను ముస్లిం మహిళలపై బలవంతంగా రుద్దుతున్నారని అన్నారు. ట్రిపుల్ తలాక్‌ను ఎవరైనా ఇష్టపడి అంగీకరించారా? అని ప్రశ్నించారు.
ఆ ఆడబిడ్డలను, సోదరీమణులను అడగండన్నారు. తాను వారి కన్నీళ్లను చూశాననీ, వారు తమ కష్టాలను చెప్పుకుంటూ.. కన్నీళ్లు పెట్టుకున్నారని అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసినందుకు జౌన్‌పూర్‌కు చెందిన ఒక మహిళ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారన్నారు. దుస్తులు ఎంపిక వ్యక్తిగతమనీ, ఆ వ్యక్తి ఇష్టంపై ఆధారపడు తుందన్నారు. తాను తనకు నచ్చినదానిని ఇతరులపై రుద్దలేదని చెప్పారు.
‘‘నా కార్యాలయంలో అందరినీ భగువా (కండువా) ధరించమని కోరగలనా? నా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరితో ఆ విధంగా చెప్పగలనా? నేను అలా చేయలేను. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉండాలి. ఏదైనా ఉంటే సంస్థ, ఆ సంస్థలో క్రమశిక్షణ ఉండాలి" అని అన్నారు. ప్రస్తుతం హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోంది.
పాఠశాలలు, కళాశాలల్లో బాలికలు, మహిళలు హిజాబ్ ధరించడంపై కర్ణాటకలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నెల రోజుల క్రితం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని కొందరు ముస్లిం బాలికలను కాలేజీల్లోకి రానీయకుండా నిషేధించడంతో ఈ విషయం వెలుగుచూసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో హిజాబ్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై జాతీయ రాజకీయ పార్టీలు పరస్పరం దాడులు చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది.
