అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా వారు పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన జనం ఏకంగా నడిరోడ్డుపైనే అంత్యక్రియలు జరిపారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం గదగ్ జిల్లా హాతలకేరి గ్రామంలో శ్మశానం లేదు.. రైతులు వారి పొలాల్లోనే అంత్యక్రియలు జరుపుకునేవారు.

తమ గ్రామంలో శ్మశానానికి స్థలం కేటాయించాలంటూ గ్రామస్తులు ఎన్నో ఏళ్ల నుంచి అధికారులను కోరుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజున ఇద్దరు మరణించడం.. అంత్యక్రియలకు స్థలం లేకపోవడంతో మృతుల కుటుంబీకులు హాతలకేరి-నాగసముద్రం ప్రధాన రహదారిపై మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహంచారు.

సమాచారం అందుకున్న తహశీల్దార్ గ్రామానికి చేరుకుని ప్రజలతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. కొన్నేళ్లుగా శ్మశానానికి స్థలం కోరుతున్నా పట్టించుకోవడం లేదని.. వెంటనే తమకు స్థలం కేటాయించని పక్షంలో తహశీల్దార్ కార్యాలయంలో అంత్యక్రియలు జరుపుతామని హెచ్చరించారు.

మరోవైపు గ్రామస్తుల చర్యపై చుట్టుపక్కల గ్రామల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటిదాకా రోడ్డుపై అంత్యక్రియలు జరిపిన దాఖలాలు లేవని ప్రజాసంఘాలు, పలువురు సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు.