ఇటీవల ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ మహిళలు, యువతులపై జరుగుతున్న  అఘాయిత్యాలకు, దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

తాజాగా హర్యానాలో మరో దారుణం జరిగింది. మతం మారేందుకు నిరాకరించిందన్న ఆగ్రహంతో ఒక యువతిని నడిరోడ్డుపై కాల్చి చంపిన వైనం తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. నిఖిత (21) అనే యువతి పరీక్ష రాసి వస్తుండగా, మార్గమధ్యంలో మాటు వేసిన ఇద్దరు ఆగంతకులు అతి సమీపం నుంచి ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. 

హర్యానాలోని ఫరీదాబాద్‌లో బీకామ్ ఫైనల్ చదువుతున్న నిఖితను తొలుత కారులో కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె పరీక్ష రాసి బయటికి వస్తుండగా బాధితురాలి స్నేహితుడుగా భావిస్తున్న తౌసీఫ్ దాడి చేశాడు.

కిడ్నాప్ యత్నాన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో నిఖిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిఖిత కిడ్నాప్ యత్నం, ఆమె ప్రతిఘటన, కారులోంచి దిగిన నిందితుడు తన రివాల్వర్ ను బయటకు తీసి కాల్పులు జరపడం, బాధితురాలు కుప్పకూలిన దృశ్యాలు స్థానికంగా వున్న సీసీటీవీలో రికార్డయ్యాయి.

అటు ఈ ఘటనపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు తౌసీఫ్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా ఇస్లాం మతంలోకి మారమని తౌసీఫ్ తమ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడని అందుకు నిరాకరించడంతోనే నిఖితను హతమార్చాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇందుకు సంబంధించి గతంలో నిందితుడిపై ఫిర్యాదు కూడా చేశామని బాధితురాలి తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు.