లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం దాదాపు ఐదు దశాబ్ధాల పాటు దేశ ప్రజల్ని తన గాత్రంతో అలరించారు. గత 50 రోజులుగా హాస్పటల్‌లో అనారోగ్యంతో పోరాడుతూ.. కరోనాను సైతం జయించిన ఎస్పీబీని ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఆయన ఇకలేరనే వార్తలతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది. దీంతో ఆయన అభిమానులు, ప్రజలు, పలువురు ప్రముఖులు బాలు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు .. బాలసుబ్రమణ్యంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

 

 

బాలు తన సొంత గ్రామానికి చెందిన వారైనందున చిన్న నాటి నుంచే తనకు ప్రత్యేక అనుబంధం వుందని తెలిపారు. ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన ఎస్పీబీ అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించిందని వెంకయ్య ట్వీట్ చేశారు.

 

 

వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారని వెంకయ్య నాయుడు కొనియాడారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.