Asianet News TeluguAsianet News Telugu

UP Polls 2022: వరుణ్- మేనకా గాంధీలకు కమలనాథుల షాక్.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ నుంచి తొలగింపు

గాంధీ కుటుంబానికి చెందిన మేనకా గాంధీ (Maneka gandhi), వరుణ్ గాంధీలకు (varun gandhi) బీజేపీ (bjp) అధిష్టానం షాకిచ్చింది. త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి మేనకా, వరుణ్‌ గాంధీలను తొలగించారు. 

Varun and Maneka Gandhi dropped from BJP's star campaigner list for UP Polls 2022
Author
Lucknow, First Published Jan 19, 2022, 6:17 PM IST

గాంధీ కుటుంబానికి చెందిన మేనకా గాంధీ (Maneka gandhi), వరుణ్ గాంధీలకు (varun gandhi) బీజేపీ (bjp) అధిష్టానం షాకిచ్చింది. త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి మేనకా, వరుణ్‌ గాంధీలను తొలగించారు. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా సహా 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను (BJPs star campaigners list) బుధవారం విడుదల చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్, పిలిభిత్‌ల నుంచి మేనకా, వరుణ్ గాంధీలు పలుమార్లు విజయం సాధించారు. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి కూడా తల్లీకొడుకులను తొలగించడం.. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ నుంచి తప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. 

దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖీంపూర్ ఖేరీ (Lakhimpur Khri) సంఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా (ajay mishra) కుమారుడు రైతులపై ఎస్‌యూవీని నడిపిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరుణ్ గాంధీ.. రైతు సమస్యలపై బీజేపీని ప్రశ్నిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఆశీష్ మిశ్రాను అరెస్ట్ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించలేదని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంలో బీజేపీతో దూరం పెరగడంతో వరుణ్ గాంధీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగింది.

ఇక బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల విషయానికి వస్తే... ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఉన్నారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, దినేష్ శర్మ, కేశవ్ ప్రసాద్ మౌర్య, సంజీవ్ బల్యాన్, రాధా మోహన్ సింగ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల మేరకు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఇంటింటీ ప్రచారంపై ఫోకస్ పెట్టింది. హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ అగ్రనేతలు జనవరి మూడో వారం నుంచి ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (up assembly elections) ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27 మరియు మార్చి 3 మరియు 7 తేదీల్లో యూపీలో పోలింగ్ జరగనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios