మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం నుంచి ఉత్తరాఖండ్‌ ఇంకా కోలుకోలేదు. చమోలీ జిల్లా జోషి మఠ్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

తపోవన్‌ పవర్ ప్లాంట్‌లో 120 మీటర్ల టన్నెల్‌లో బురద మొత్తాన్ని తొలగించాయి. ఈ సమయంలో మరికొన్ని మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 31కి చేరింది.

సహాయక బృందాలు ఇప్పటివరకు 30 మందిని రక్షించాయి. అయితే ఆదివారం నాడు గల్లంతైన వారిలో ఇంకా 160 మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉంది. హెలికాప్టర్ల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం అందిస్తున్నారు.  

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ మంగళవారం సంఘటన ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టారు. అనంతరం తపోవన్‌లోని చిన్న టన్నెల్‌ నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది కార్మికులను పరామర్శించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడిన సీఎం.. సహాయక చర్యలు చేపట్టామని, సాధ్యమైనంత మందిని ప్రాణాలతో రక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు,. టన్నెళ్లలో బురద తొలగించేందుకు అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.  

మరోవైపు ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ భారీ విరాళం అందించారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి రూ.11 కోట్లను విరాళంగా ప్రకటించారు.