హైదరాబాద్:  ఐఎఎస్, ఐపీఎస్ సర్వీస్ పోస్టుల భర్తీ కోసం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు 2020  ఆదివారంనాడు ప్రారంభమయ్యాయి.

రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర నుండి 11:30 గంటల వరకు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.దేశంలోని పట్టణాల్లోని 2569 పరీక్షా కేంద్రాల్లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది 10.58 లక్షల మంది ఈ పరీక్షలు రాసేందుకు ధరఖాస్తు చేసుకొన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వచ్చే ఏడాది జరిగే పరీక్షలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉన్నందున పరీక్షలను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దీంతో ఇవాళ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒక్కసారి ప్రకటించిన తేదీని అక్టోబర్ 4వ తేదీకి యూపీఎస్ సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని యూపీఎస్‌సీకి సుప్రీంకోర్టు సూచించింది.కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను మాస్క్ ధరించిన అభ్యర్ధులకు మాత్రమే పరీక్ష హాల్ లోకి అనుమతిస్తున్నారు. బ్లాక్ బాల్ పాయింట్ ను మాత్రమే అనుమతిస్తున్నారు.

ఈ పరీక్ష రాసే అభ్యర్ధులకు శానిటైజర్ బాటిల్స్ ను అనుమతిచ్చింది యూపీఎస్ సీ.ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో 68 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో హైద్రాబాద్, వరంగల్ కేంద్రాల్లో పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో 115 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.