లక్నో:కూతురి ప్రేమ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు తండ్రిని అత్యంత దారుణంగా హత్య చేసింది కూతురు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తరప్రదేశ్‌లోని బోదాన్‌ జిల్లాలో  ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బోదాన్‌ జిల్లా వాజిర్‌గంజ్‌ ఏరియా హత్రా గ్రామానికి చెందిన అమిర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది.
 
ఈ విషయం అమిర్‌కు తెలియటంతో ఈ నెల 5వ తేదీన కూతుర్ని నిలదీశాడు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులకు అమిర్‌కు మధ్య గొడవ చోటుచేసుకుంది.

దీంతో ఆగ్రహానికి గురైన వారు అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. 30 శాతం కాలిన గాయాలతో ఇంట్లోనే తీవ్రగాయాలతో ఆయన కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు  సమాచారం ఇచ్చారు.

అతడి వాగ్మూలం మేరకు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసుకున్నారు.  తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు బాధితుడు మృతిచెందాడు. కుటుంబసభ్యులు పరారీలో ఉండటంతో దగ్గరి బంధువులు, పొరిగింటివారు, పోలీసులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.