అసెంబ్లీ ఎన్నికలకు ముందు యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య (Swami Prasad Maurya) తన పదవికి రాజీనామా చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ఉత్తరప్రదేశ్ కీలక పరిణామాలు చోటుచేసకుంటున్నాయి. ఎన్నికలకు ముందు యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య (Swami Prasad Maurya) తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా బీజేపీకి కూడా గుడ్ బై చెప్పారు. అనంతరం మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయిన స్వామి ప్రసాద్ మౌర్య.. సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ పరిణామం చోటుచేసుకున్న కొద్ది సేపటికే.. మరో బీజేపీ ఎమ్మెల్యే రోషన్ లాల్ వర్మ (Roshan Lal Verma) కూడా పార్టీకి రాజీనామా చేయనున్నట్టుగా ప్రకటించారు. స్వామి ప్రసాద్ మౌర్య.. తనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను కూడా అఖిలేష్ పార్టీలోకి తీసుకెళ్తారని సమాచారం. 

స్వామి ప్రసాద్ మౌర్య‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన అఖిలేష్ యాదవ్.. ‘సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడిన ప్రముఖ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్యకి, ఆయనతో పాటు సమాజ్‌వాదీ పార్టీలోకి వచ్చిన ఇతర నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులందరికీ హృదయపూర్వక స్వాగతం, శుభాకాంక్షలు’ అని Akhilesh Yadav ట్వీట్ చేశారు. 

ఇక, స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా లేఖలో రాష్ట్రంలో దళితులు, రైతులు, నిరుద్యోగులు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని ఆరోపించారు. ‘భిన్నమైన భావజాలం ఉన్నప్పటికీ.. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో అంకితభావంతో పనిచేశాను. కానీ దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులు.. తీవ్ర అణచివేతకు గురవుతున్నందున రాజీనామా చేస్తున్నాను’ అని స్వామి ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. 

ఇక, స్వామి ప్రసాద్ మౌర్య బలమైన ఓబీసీ నేతగా ఉన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016లో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పద్రౌనా నుంచి బిజెపి ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్వామి ప్రసాద్ మౌర్య కుమార్తె సంఘమిత్ర ఉత్తరప్రదేశ్‌లోని Badaun లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. 

Scroll to load tweet…

ఈ పరిణామంపై స్పందించిన ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య.. పార్టీని వీడవద్దని స్వామి ప్రసాద్ మౌర్యను కోరారు. ‘స్వామి ప్రసాద్ మౌర్య ఎందుకు పార్టీ వీడారో నాకు తెలియదు. పార్టీని విడిచిపెట్టవద్దని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు ప్రతికూలంగా మారవచ్చు’ అని పేర్కొన్నారు.