Asianet News TeluguAsianet News Telugu

UP Election 2022: బంగారు రుద్రాక్ష‌మాల‌, ఒక రైఫిల్.. ఒక రివాల్వ‌ర్.. యోగి ఆదిత్యానాథ్ ఆస్తులు ఇవే !

UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. శుక్రవారం ఆయన గోరఖ్‌పూర్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను కూడా తెలిపారు. 
 

UP Election: CM Yogi declares assets worth over Rs 1.5 crore in poll affidavit, no pending criminal cases
Author
Hyderabad, First Published Feb 4, 2022, 4:57 PM IST

UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో నామినేష‌న్ల ప‌ర్వంకొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి బరిలో దిగుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలతో క‌లిసి ఆయ‌న ఎన్నిక‌ల అధికారికి త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు. నామినేష‌న్ వేసే ముందు సీఎం యోగి ఆధిత్యానాథ్‌.. గోరఖ్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 రూ.1.54 కోట్ల  విలువైన ఆస్తులు !

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను కూడా తెలిపారు. ఇందులో తన వద్ద రూ.1.54 కోట్ల ఆస్తులున్నట్లు వెల్ల‌డించారు. తనపై ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు చేయలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు రూ.1 కోటి 54 లక్షల 94 వేల 54 రూపాయ‌లు. ఇందులో 1 లక్ష నగదు ఉంది. గతంలో 2017లో యోగి ఆదిత్యనాథ్ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన ఆస్తులు రూ.95.98 లక్షలుగా ప్రకటించారు. ఐదేళ్లలో ఆయన ఆస్తులు దాదాపు రూ.60 లక్షలు పెరిగాయి. 

బంగారు రుద్రాక్ష‌మాల ! 

అలాగే, ఢిల్లీ, లక్నో, గోరఖ్‌పూర్‌లోని 6 చోట్ల వివిధ బ్యాంకుల్లో సీఎం యోగికి 11 ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాల్లో 1 కోటి 13 లక్షల 75 వేల రూపాయలకు పైగా జమ అయ్యాయ‌ని పేర్కొన్నారు. సీఎం యోగికి భూమి, ఇల్లు లేవు. కానీ జాతీయ పొదుపు పథకాలు, బీమా పాలసీల ద్వారా అతని వద్ద రూ.37.57 లక్షలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ వద్ద 49 వేల రూపాయల విలువైన బంగారు న‌గ‌లు కూడా ఉన్నాయి. వాటి బరువు 20 గ్రాములు. అలాగే,  20 వేల రూపాయ‌ల విలువ చేసే బంగారు రుద్రాక్ష మాల కూడా ఉంద‌ని ఆయ‌న అఫిడ‌విట్ లో పేర్కొన్నారు. ఈ బంగారు రుద్రాక్ష మాల ఖ‌రీదు 20 వేల రూపాయ‌లుగా పేర్కొన్నారు. 

ఒక రివాల్వ‌ర్‌.. ఒక రైఫిల్ ! 

సీఎం యోగి వద్ద 12 వేల రూపాయల విలువైన మొబైల్ ఫోన్ కూడా ఉంది. త‌న వ‌ద్ద ఉన్న కార్ల వివ‌రాల‌ను కూడా పేర్కొన్నారు. అలాగే, ఆయ‌న రెండు ఆయుధాల‌ను కూడా క‌లిగి ఉన్నారు. యోగి వ‌ద్ద ల‌క్ష రూపాయ‌ల విలువైన రివాల్వ‌ర్ తో పాటు.. 80 వేల రూపాయ‌ల విలువైన రైఫిల్ ఉంద‌ని నామినేష‌న్ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లో పేర్కొన్నారు.

యోగి ఆదాయ వనరులు ఇవే.. ! 

సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదాయ వనరులో ప్రజాప్రతినిధిగా (మాజీ ఎంపీ, ఎమ్మెల్యే) పొందిన జీతం, అలవెన్సుల  ద్వారా త‌న‌కు ఆదాయం వ‌స్తున్న‌ద‌ని నామినేష‌న్ తో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లో పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొద‌టిసారి పోటీ.. ! 

యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బ‌రిలోకి దిగుతున్నారు. జూన్ 5, 1972లో జన్మించిన యోగి ఆదిత్యనాథ్ తన 26వ ఏట తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. తొలిసారిగా 1998లో గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014లో వరుసగా 5 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యోగి ఆదిత్యనాథ్ 2017లో యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios