ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేడు నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 9 జిల్లాలోని 59 నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
నేడు యూపీలో నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఫతేపూర్, బందా, పిలిభిత్, హర్దోయ్, ఖేరీ, లక్నో, రాయ్ బరేలీ, సీతాపూర్, ఉన్నావ్ వంటి తొమ్మిది జిల్లాల్లోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 208 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 13,813 పోలింగ్ స్టేషన్లు, 24,580 పోలింగ్ బూత్‌లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముందస్తు జాగ్రత్తలతో ఓటింగ్ జరగనుంది.
దేశంలోనే అతి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ , సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరిగే 59 స్థానాలకు గాను 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2017 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ 51 సీట్లు గెలుచుకుంది.
లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఉత్తరప్రదేశ్ న్యాయ మంత్రి బ్రజేష్ పాఠక్ పై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి సురేంద్ర సింగ్ గాంధీ తలపడుతున్నారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్ పోటీ చేస్తున్న సరోజినీ నగర్ స్థానం నుంచి, అఖిలేష్ యాదవ్ సన్నిహితుడు మాజీ IIM ప్రొఫెసర్ అభిషేక్ మిశ్రాతో పోటీ పడుతున్నారు.
రాయ్‌బరేలీ సదర్‌లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తున్న లఖింపూర్ ఖేరీలో కూడా నేడు పోలింగ్ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సమయంలో 8 మంది చనిపోయిన ప్రాంతం ఇది. 2017 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఉత్కర్ష్ వర్మ మధుర్‌ను 37,000 ఓట్ల ఆధిక్యతతో ఓడించి బీజేపీకి చెందిన యోగేష్ విజయం సాధించారు. ఈ లఖింపూర్ ఖేరీ నియోజకవర్గంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
నేడు జరిగే ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇందులో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను సున్నితమైనవిగా ప్రకటించారు. 590 ప్రాంతాలను డేంజర్ గా గుర్తించారు. ఈ ఎన్నికల కోసం దాదాపు 800 కంపెనీల పారామిలటరీ బలగాలు, 60,000 మందికి పైగా పోలీసులు బందోబస్తుగా ఉండనున్నారు. మహిళల ఓటర్లను చైతన్యపరిచేందుకు మొత్తం 137 పింక్ బూత్‌లు ఏర్పాటు చేశారు. వీటిల్లో 36 మంది మహిళా ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, 277 మంది మహిళా కానిస్టేబుళ్లు, చీఫ్ కానిస్టేబుళ్లను నియమించారు.
కాగా.. ఏడు దశల యూపీ ఎన్నికల్లో మిగిలిన మూడు దశలకు ఫిబ్రవరి 27, మార్చి 3, 7 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మార్చి 10న ప్రకటిస్తారు.
