Ayodhya: డ్రైనేజీ, రోడ్లు శుభ్రం చేస్తున్న యూపీ డిప్యూటీ సీఎం
జనవరి 22న జరిగే వేడుక కోసం అయోధ్య నగరం ముస్తాబు అవుతున్నది. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై రామ మందిరాన్ని ప్రారంభిస్తారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఇందుకోసం నగరం సర్వాంగ సుందరంగా మారుతున్నది. ఈ పనిలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పాలుపంచుకున్నారు. ఆయన పారిశుధ్య పనులు కూడా చేశారు.
Ayodhya: అయోధ్య నగరం గ్రాండ్ ఈవెంట్‌కు ముస్తాబవుతున్నది. వచ్చే నెల 22వ తేదీన రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం సిద్ధం అవుతున్నది. కొత్త ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్‌లో మార్పులు, నగరం మొత్తం సుందరీకరణ జరుగుతున్నది. లక్షల మంది భక్తులు జనవరి 22న కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఎలాంటి లోటు రాకుండా చూసుకునేలా అన్ని పనులు చేస్తున్నది. ఈ క్రమంలోనే అయోధ్య నగరం మొత్తం రూపుమార్చుకుంటున్నది. ఈ యజ్ఞంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాలుపంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏకంగా యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా కదం తొక్కారు. చేతులకు గ్లవ్స్ తొడుక్కుని, ముఖానికి మాస్క్ పెట్టుకుని పారిశుధ్య పనికీ నడుం కట్టారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఎక్స్ అకౌంట్‌లో ఆయన పారిశుధ్య పనులు చేస్తున్న ఫొటోలు కనిపించాయి. ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి. డ్రైనేజీని శుభ్రం చేసే పనిలో ఆయన పాలుపంచుకున్నారు. రోడ్లనూ శుభ్రం చేయడంలో భాగంపంచుకున్నారు. నాలుగు రోజుల అయోధ్య పర్యటనలో ఆయన ఫుల్ బిజీగా గడుపుతున్నారు.
Also Read: TSPSC Group 2 Exam :బిగ్ బ్రేకింగ్.. గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా..
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ రోజు అయోధ్యకు రాబోతున్నారు. జనవరి 22 పండుగ కోసం సన్నద్ధత పనులను సమీక్షించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 30వ తేదీన అయోధ్యకు రానున్నారు. ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. అలాగే.. రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్‌ను కూడా ప్రారంభిస్తారు.
జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారు. అదే రోజున లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.