Asianet News TeluguAsianet News Telugu

ఉత్తర ప్రదేశ్ అభివృద్దిలో కరోనాది కీలకపాత్రే ... ఎలాగంటే..: సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు

ఉత్తర ప్రదేశ్ లో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఈ ట్రేడ్ షో వల్ల యూపీకి కలిగే లాభాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరించారు. 

 

UP CM Yogi Adityanath says Uttar Pradesh is India's new growth engine at UPITS 2024 AKP
Author
First Published Sep 25, 2024, 10:31 PM IST | Last Updated Sep 25, 2024, 10:31 PM IST

లక్నో : దేశంలో అత్యధిక జనాభాతో పాటు అత్యధిక ఎంఎస్ఎంఈ యూనిట్లను కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఒక సర్వే ప్రకారం రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 96 లక్షల MSME యూనిట్లు ఉన్నాయి... వ్యవసాయం తర్వాత యూపీ ప్రజలకు అత్యధిక ఉపాధిని కల్పిస్తున్న రంగం ఇదేనని సీఎం యోగి పేర్కొన్నారు.

ఇవాళ (బుధవారం) యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో-2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌కు సీఎం యోగి స్వాగతం పలికి, ట్రేడ్ షోలోని వివిధ స్టాళ్లను దగ్గరుండి చూపించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ప్రసంగించారు. 

2017 నుండే యూపీలో అసలైన అభివృద్ది

యూపీలో వందల సంవత్సరాలుగా వివిధ రంగాల్లో ఉపాధి కల్పనకు చేతివృత్తులవారు, కళాకారులు తమవంతు సహకారం అందించారని.., కానీ స్వాతంత్య్రం తర్వాత సరైన ప్రోత్సాహం లేకపోవడం, సకాలంలో సాంకేతికత అందకపోవడంతో ఈ సాంప్రదాయ పరిశ్రమలు దాదాపుగా మూసివేత దశకు చేరుకున్నాయని సీఎం యోగి అన్నారు. 2017లో యూపీలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే... ప్రధాని మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేసే దిశగా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దీనిలో భాగంగానే 75 జిల్లాలకు ప్రత్యేక ఉత్పత్తులను ODOP కింద గుర్తించడం జరిగింది. వీటి ప్రోత్సాహం, బ్రాండింగ్, మార్కెటింగ్, డిజైనింగ్, ప్యాకేజింగ్, సాంకేతికతను అనుసంధానించేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశాం. యూపీలో ఇది ఉపాధి కల్పనకు అతి ముఖ్యమైన కేంద్రంగా అవతరించింది.

కరోనా యూపీకి మంచే చేసింది :

కరోనాకు ముందు యూపీకి చెందిన కార్మికులు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని సీఎం అన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా వారు జీవనోపాధి కోల్సోయి స్వరాష్ట్రానికి వచ్చారన్నారు. కానీ యూపీ వారిని అక్కున చేర్చుకుంది...  40 లక్షలు కాదు 4 కోట్ల మంది వచ్చినా వారికి ఉపాధి కల్పించగలననే నమ్మకం తనకు ఆనాడే వుందన్నారు యోగి. యూపీలోకి అడుగుపెట్టిన వెంటనే 40 లక్షల మంది కార్మికుల నైపుణ్యాన్ని అంచనా వేసి, ప్రతి జిల్లాకు ఆ డేటాను అందజేయడంతో పాటు సంబంధిత యూనిట్లలో ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగింది. ఈ కార్మికులు యూపీకి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు.

దేశాభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌గా యూపీ

ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. ఇదే సమయంలో యూపీని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్రం వేగంగా దూసుకుపోతోందని సీఎం యోగి అన్నారు. ఏడు సంవత్సరాల క్రితం దేశాభివృద్ధికి అవరోధంగా భావించిన యూపీ, నేడు దేశాభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌గా గుర్తింపు పొందుతోందన్నారు. ఇందులో ఎంఎస్ఎంఈ రంగం పాత్ర కీలకం. బలమైన ఎంఎస్ఎంఈ రంగం లేకుండా ఏ పెద్ద పరిశ్రమ ముందుకు సాగలేదన్నారు సీఎం యోగి.

UP CM Yogi Adityanath says Uttar Pradesh is India's new growth engine at UPITS 2024 AKP

యూపీ వద్ద అత్యధికంగా 75 GI ట్యాగ్‌లు

యూపీలో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏదైనా ఎంఎస్ఎంఈ యూనిట్ ప్రకృతి విపత్తుకు గురైతే, రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని సీఎం యోగి అన్నారు. రాష్ట్రంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలు, ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు చురుగ్గా సాగుతోందన్నారు. ODOP పథకం విజయంతో పాటు, యూపీ వద్ద అత్యధికంగా 75 GI ట్యాగ్‌లు ఉన్నాయన్నారు. ప్రోత్సాహం లేక కనుమరుగవుతున్న ఉత్పత్తులను తిరిగి ప్రోత్సహించేందుకు కృషి జరుగుతోందని భరోసా ఇచ్చారు. యూపీలోని వివిధ రంగాల్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పుడు యూపీ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు యూపీఐటిఎస్ వేదికగా నిలుస్తోంది.

ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతాయి

ఐదు రోజుల పాటు జరిగే ఈ ట్రేడ్ షో లో G2G, G2Bతో సహా అనేక కార్యక్రమాలు ఉంటాయని... ఇది యూపీ సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా సాంస్కృతిక-సామాజిక వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి సరైన వేదికగా నిలుస్తుందని సీఎం యోగి అన్నారు. యూపీకి చెందిన పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రపంచానికి చూపించుకునేందుకు ఇది ఒక అవకాశమన్నారు.

అత్యుత్తమ మౌలిక సదుపాయాలకు కేరాఫ్ అడ్రస్‌గా యూపీ

యూపీ అత్యుత్తమ ఎంఎస్ఎంఈ స్థావరంగానే కాకుండా, అత్యుత్తమ మౌలిక సదుపాయాలకు కూడా ప్రసిద్ధి చెందిందని సీఎం యోగి అన్నారు. ప్రస్తుతం యూపీలో ఆరు ఎక్స్‌ప్రెస్‌వేలు అందుబాటులో వుండగా మరో ఏడు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 11 విమానాశ్రయాలు వుండగా, మరో 10 నిర్మాణంలో ఉన్నాయన్నారు. 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు క్రియాశీలంగా ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (జేవర్)ను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

దేశంలోనే అతి పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ యూపీని తూర్పు యూపీతో కలుపుతోందని తెలిపారు ప్రయాగరాజ్ మహా కుంభమేళా-2025 కంటే ముందే దీనిని ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అత్యుత్తమ రైలు, రోడ్డు మార్గాల నెట్‌వర్క్ యూపీ సొంతమన్నారు. యూపీ నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని మానవ వనరులకు కేంద్రంగా అవతరించిందన్నారు. స్వామి వివేకానంద యువ సశక్తీకరణ పథకం కింద ప్రభుత్వం రెండు కోట్ల మంది యువతకు ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోందని సీఎం యోగి తెలిపారు.

యూపీని ప్రపంచానికి చూపించేదే ఈ ట్రేడ్ షో

ఐదు రోజుల పాటు జరిగే ఇంటర్నేషనల్ ట్రేడ్ షో యూపీ ఉత్పత్తులు, సామర్థ్యం, సాంస్కృతిక ప్రత్యేకత, సామాజిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చూపించడంలో విజయవంతమవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేసారు. 2500 మందికి పైగా ప్రదర్శకులు, 350 మందికి పైగా విదేశీ కొనుగోలుదారులు ఇప్పటికే హాజరయ్యారన్నారు. భాగస్వామ్య దేశంగా వియత్నాం పాల్గొనడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వియత్నాం ప్రతినిధులను కూడా కలిశారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios