తండ్రిని జైల్లో పెట్టిన కాంగ్రెస్‌తో అఖిలేష్ పొత్తా? : యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి 'బాబు ఇంకా పెద్దవాడు కాలేదు' అంటూ ఎద్దేవా చేశారు. 

UP ByElection 2024 CM Yogi attacks SP leader Akhilesh Yadav AKP

లక్నో : ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మూడు బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఖైర్ నుండి సురేంద్ర దిలేర్, సిసామౌ నుండి సురేష్ అవస్థి, కర్హల్ నుండి అనుజేష్ యాదవ్ లకు మద్దతుగా యోగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వం, విధానాలు, నాయకులను యోగి ఘాటుగా విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీ టోపీ ఎర్రగా ఉన్నా, వాళ్ళ పనులు మాత్రం నల్లగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కర్హల్‌లో అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి 'బాబు ఇంకా పెద్దవాడు కాలేదు' అని ఎద్దేవా చేశారు. కాశ్మీర్‌ను మళ్ళీ ఉగ్రవాద కేంద్రంగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

నేతాజీని జైల్లో పెట్టిన కాంగ్రెస్‌తో అఖిలేష్ పొత్తా?

కర్హల్‌లో అఖిలేష్ యాదవ్‌పై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ఆయన ప్రవర్తన తన తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ భావాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్ ఒడిలో కూర్చుందని విమర్శించారు.

ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ములాయం సింగ్ యాదవ్ ను జైల్లో పెట్టిందని యోగి గుర్తుచేసారు. నేతాజీ ఎప్పుడూ కాంగ్రెస్‌ను వ్యతిరేకించేవారు..., అలాంటి పార్టీతో ఎప్పుడూ కలవకూడదని చెప్పేవారని అన్నారు. కానీ ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ నేతాజీ విలువలు, ఆదర్శాలకు దూరమైంది...ఆ పార్టీ నాయకత్వం చేస్తున్న పనులు చూసి ములాయం సింగ్ యాదవ్ బాధపడుతుంటారని అన్నారు. తన కొడుకు సమాజ్‌వాదీ పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టి పార్టీని నాశనం చేస్తున్నాడని ఆవేదన చెందుతుంటారని అన్నారు.

కొంతమందికి జీవితాంతం కొన్ని అలవాట్లు ఉంటాయి... బాబు ఇంకా పెద్దవాడు కాలేదు కాబట్టి కొన్నిసార్లు అలాంటి పనులు చేస్తాడంటూ అఖిలేష్ ను ఉద్దేశించి సెటైర్లు వేసారు యోగి. అఖిలేష్ పనులవల్ల మైన్‌పురి ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుందన్నారు. ములాయం సింగ్ యాదవ్ వంటివారు రామ్ మనోహర్ లోహియాను ఆదర్శంగా తీసుకున్నారు... నిజమైన సోషలిస్ట్ అంటే ఆస్తి, సంతానంపై మోజు లేనివాడని లోహియా చెప్పారు, కానీ సమాజ్‌వాదీ పార్టీలో అన్ని పదవులు ఒకే కుటుంబానికి కావాలని యోగి విమర్శించారు.

సమాజ్‌వాదీ పార్టీ రామ ద్రోహి అని యోగి ఆరోపించారు. వాళ్ళు రామమందిరం చూడటానికి కూడా వెళ్ళలేదు... ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని భావించారు. కృష్ణుడిని గౌరవించలేకపోతే మా ఓట్లు అడగడానికి ఎందుకు వస్తున్నారని కర్హల్ ప్రజలు వాళ్ళను ప్రశ్నించాలని సూచించారు. 

రామాలయం నిర్మిస్తాం అని బిజెపి చెప్పింది... చేసి చూపించాం. మథురలో కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తాం. దీనికి సమాజ్‌వాదీ పార్టీ అంగీకరిస్తుందా? అని నిలదీసారు. మథుర-వృందావన్ అభివృద్ధిపై ప్రభుత్వ ఆలోచనకు మద్దతు ఇస్తుందా? అని అడిగారు. వాళ్ళకు ఓట్లు  మాత్రమే కావాలి...అందుకోసం భగవాన్ శ్రీకృష్ణుడిని కూడా గౌరవించరని అన్నారు. అందుకే ఈ విషయంపై మౌనంగా ఉన్నారన్నారు.

 ప్రభుత్వం మథుర, గోకుల్, బర్సాన, బల్దేవ్, వృందావన్ వంటి పుణ్యక్షేత్రాల అభివృద్ధి చేస్తోందని యోగి తెలిపారు. మథుర-వృందావన్ 5 వేల సంవత్సరాల క్రితం నాటి కాలంలోకి వెళ్లినట్లు అనిపిస్తోంది, అప్పుడు కృష్ణుడు స్వయంగా అక్కడ నివసించేవాడని అన్నారు..

సమాజ్‌వాదీ పార్టీ నాయకులపై సీరియస్  

అయోధ్యలో నిషాద్ కుమార్తె, కన్నౌజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి చర్యలు ఎవరికీ తెలియనివి కావు... ఇవి సభ్య సమాజానికి కళంకం అని అన్నారు. ఎర్ర టోపీ పెట్టి నల్ల పనులను ప్రోత్సహించవద్దు... వీళ్ళు కుట్రలు చేసి మళ్ళీ ఉత్తరప్రదేశ్‌ను అల్లకల్లోలంలోకి నెట్టేస్తారని ఆందోళన వ్యక్తం చేసారు. లోక్‌సభ ఎన్నికల్లో వీళ్ళ అబద్ధాలు బయటపడ్డాయి... ఎన్నికల్లో వీళ్ళను ఓడించాలని ప్రజలకు సూచించారు. తప్పుడు వ్యక్తికి మద్దతు ఇస్తే భవిష్యత్ తరాల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమే, ప్రస్తుత తరం నాశనం అవుతుందన్నారు. 

ఇక ఖైర్‌ ఎన్నికల సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిన అలీగఢ్ రాజు మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరు మీద రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ విశ్వవిద్యాలయం మీ తరతరాలను తీర్చిదిద్దుతుంది. రాజా మహేంద్ర సింగ్ విశ్వవిద్యాలయం ముందుకు వెళుతుందా లేక అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ముందుకు వెళుతుందా అనే పోటీ ఉండాలన్నారు.

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని మైనారిటీ సంస్థగా ఏర్పాటు చేయాలా లేక సాధారణ సంస్థగా ఉండాలా అనే దానిపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయన్నారు.. భారతదేశ వనరులతో, ప్రజల పన్నులతో నడిచే ఈ సంస్థ వెనుకబడిన, షెడ్యూల్డ్ కులాలు-జాతులకు రిజర్వేషన్లు కల్పించడం లేదు, కానీ ముస్లింలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోందన్నారు.భారత రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలు-జాతులు, మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా వెనుకబడిన కులాలకు రిజర్వషన్ కల్పిస్తోంది, కానీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఈ సౌకర్యం ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. భారతదేశ డబ్బు వెచ్చిస్తున్నప్పుడు, అక్కడ కూడా వీళ్ళకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగాలు, ప్రవేశాల్లో కూడా ఈ సౌకర్యం కల్పించాలన్నారు. దీన్ని ఎందుకు నిలిపివేశారో తెలుసా? ఎందుకంటే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు దీన్ని కోరుకోవడం లేదు. ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి వీళ్ళు మన భావాలతో, జాతీయ ఐక్యత, సమగ్రతతో చెలగాటం ఆడుతున్నారని యోగి మండిపడ్డారు.

కాశ్మీర్‌ను ఉగ్రవాద కేంద్రంగా మార్చేందుకు కుట్రలు 

జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఉంది. అక్కడి అసెంబ్లీ కాశ్మీర్‌లో మళ్ళీ 370వ అధికరణం పునరుద్ధరించాలని తీర్మానం చేసింది. భారత రాజ్యాంగంలో 370వ అధికరణం చేర్చడం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టం లేదు, కానీ నెహ్రూ మొండితనం వల్ల దాన్ని చేర్చారు. కాంగ్రెస్ ఎప్పుడూ 370వ అధికరణాన్ని రద్దు చేయడానికి ప్రయత్నించలేదు, కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ 35ఎ, 370 అధికరణాలను రద్దు చేశారు. దీనివల్ల అక్కడ ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి, భద్రత మెరుగుపడ్డాయి. ఇప్పుడు కాశ్మీర్‌కు లక్షలాది మంది పర్యాటకులు వస్తున్నారు. కాశ్మీర్‌ను మళ్ళీ ఉగ్రవాద కేంద్రంగా మార్చేందుకు కుట్రలు ప్రారంభమయ్యాయని యోగి ఆరోపించారు.

కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజలను విడగొట్టి గెలుస్తుంది. కాబట్టి విడిపోకండి... విడిపోయినప్పుడు నష్టపోయారు. ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటారని యోగి సూచించారు. రామమందిరం, కాశీ విశ్వనాథ్, మథురలో కృష్ణుడి జన్మస్థలం అవమానానికి గురయ్యాయని అన్నారు. 

 2017కి ముందు, తర్వాత ఉత్తరప్రదేశ్‌లో తేడా ఏమిటో యోగి వివరించారు. గతంలో అలీగఢ్‌లో ప్రతి 10 రోజులకు అల్లర్లు, కర్ఫ్యూ విధించేవారు, కానీ ఇప్పుడు ఏడున్నర సంవత్సరాలుగా ఎలాంటి అల్లర్లు, గూండాయిజం జరగలేదు. 

గతంలో ఇందిరా ఆవాస్ పథకం కింద 20 వేల రూపాయలు వచ్చేవి, అది కూడా గ్రామంలో ఒకరికే వచ్చేది. పింఛన్ కూడా సమాజ్‌వాదీ పార్టీ వాళ్ళకే వచ్చేది, కానీ బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ పథకాలను అందిస్తోంది. కల్యాణ్ సింగ్ అలీగఢ్ కోసం కన్న కల నెరవేరింది. అలీగఢ్‌లో విమానాశ్రయం ప్రారంభమైంది. ఇది డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్‌కు ముఖ్య కేంద్రంగా మారుతోంది. హార్డ్‌వేర్ కేంద్రంగా మారింది. ఇక్కడి తాళం పరిశ్రమ పునరుద్ధరించబడింది.

రాజు పాల్, ఉమేష్ పాల్ హత్యలపై సమాజ్‌వాదీ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది?

రాజు పాల్, ఉమేష్ పాల్ హత్యలపై సమాజ్‌వాదీ పార్టీ ఎందుకు మౌనంగా ఉందని యోగి ప్రశ్నించారు. ఉమేష్ పాల్ భద్రతకు నియమించిన నిషాద్ జవాన్ తప్పు ఏమిటి? వీళ్ళు తమ ప్రవర్తన మార్చుకోరు. వీళ్ళు మాఫియా, నేరస్థులు, అల్లరిమూకలను ప్రోత్సహించి, రాష్ట్రాన్ని అల్లకల్లోలంలోకి నెట్టే ప్రయత్నం చేస్తారు. కాన్పూర్ అల్లరిమూక జైల్లో ఉంది. దళితులు, వాల్మీకి సమాజానికి చెందిన భూమిని ఆక్రమించిన సమాజ్‌వాదీ పార్టీ మాజీ మంత్రి రామ్‌పూర్ జైల్లో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఆయనను నిర్దోషిగా భావిస్తోంది. ప్రయాగ్‌రాజ్ అయినా, గాజీపూర్ అయినా, సమాజ్‌వాదీ పార్టీ అమాయక పౌరులపై సానుభూతి చూపించదు, కానీ మాఫియా ఇంటికి వెళ్లి సంతాపం తెలియజేస్తుంది. 1984లో సిక్కులపై జరిగిన దారుణాలు కాంగ్రెస్ నిజస్వరూపాన్ని చూపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని యోగి అన్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios