Asianet News TeluguAsianet News Telugu

up assembly election 2022 : ఒపీనియన్ పోల్స్ ప్ర‌సారాల‌ను ఆపండి - ఎన్నిక‌ల సంఘానికి స‌మాజ్ వాదీ పార్టీ లేఖ

వార్తా ఛానెళ్ల‌లో ఒపీనియన్ పోల్స్ ప్రసారాలను నిలిపివేయాలని సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ నిర్ణయం తక్ష‌ణం అమ‌ల్లోకి వ‌చ్చేలా చూడాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసింది. 


 

up assembly election 2022: Stop Opinion Poll broadcasts - Samajwadi Party letter to Election Commission
Author
Lucknow, First Published Jan 24, 2022, 10:20 AM IST

యూపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పోలిటిక‌ల్ హీట్ ఎక్కువ‌వుతోంది. అధికార, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ సారి అధికారం చేప‌ట్ట‌బోయేది తామే అంటూ ధీమాగా ఉన్నారు. దీని కోసం ఓట‌ర్ల‌కు వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వ‌స్తే ఇది చేస్తాం, అది చేస్తామంటూ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డారు. 

ఇదిలా ఉండ‌గా.. యూపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌నే విష‌యంలో ప‌లు సంస్థ‌లు ఒపినీయ‌న్ పోల్స్ నిర్వ‌హిస్తున్నాయి. ఫ‌లానా పార్టీకి ఇన్ని స్థానాలు వ‌స్తాయంటూ అంచ‌నా వేస్తున్నాయి. వీటిని ప‌లు మీడియా సంస్థ‌లు ప్ర‌సారం చేస్తున్నాయి. అయితే ఈ విష‌యంలో స‌మాజ్ వాదీ పార్టీ స్పందించింది. వార్తా ఛానెళ్ల‌లో ఒపినీయ‌న్ పోల్స్ నిలిపివేయాల‌ని, ఈ నిర్ణ‌యం తక్ష‌ణం అమ‌ల్లోకి వ‌చ్చేలా చూడాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఆ పార్టీ లేఖ రాసింది. పోల్స్ ను ప్రసారం చేయడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమేనని అని పేర్కొంది. ఇవి ఓటర్లను తప్పుదారి పట్టించి ఎన్నికలను ప్రభావితం చేస్తాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు సమాజ్ వాదీ పార్టీ యూపీ అధ్యక్షుడు న‌రేష్ ఉత్త‌మ్ ప‌టేల్ లేఖ రాశార‌ని ఆదివారం ఆ పార్టీ ప్ర‌ధాన అధికార ప్ర‌తినిధి రాజేంద్ర చౌద‌రి ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేశారు. 

కొన్ని వార్తా ఛానెల్‌లు ఒపీనియన్ పోల్స్‌ను చూపిస్తున్నాయని, ఇది మోడల్ కోడ్ ఆఫ్ పోల్ కోడ్ ఉల్లంఘించి, ఓటర్లను తప్పుదారి పట్టించే అవకాశం ఉంద‌ని ఆ లేఖ‌లో ఉత్త‌మ్ ప‌టేల్  పేర్కొన్నారు. అయితే అది పోల్స్ ప్ర‌భావం చూపుతుంద‌ని తెలిపారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల కోసం కొన్ని వార్తా ఛానెళ్లలో ప్రసారమవుతున్న అభిప్రాయ సేకరణలను తక్షణమే నిలిపివేయాలని ఉత్త‌మ్ ప‌టేల్ ఆ లేఖ‌లో డిమాండ్ చేశారు. 

స‌మాజ్ వాదీ పార్టీ ఎన్నిక‌ల సంఘానికి రాసిన లేఖ విషయంలో యూపీ బీజేపీ అధికార ప్ర‌తినిధి రాకేష్ త్రిపాఠి స్పందించారు. ఇది స‌మాజ్ వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాదవ్ ‘‘నిరాశ’’ గా అభివర్ణించారు. ఆయ‌నకు ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని విమర్శించారు. ‘‘కొన్నిసార్లు ఆయ‌న (అఖిలేష్ యాదవ్) ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై ప్రశ్నలు లేవనెత్తారు. మ‌రి కొన్నిసార్లు ఆయ‌న డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రచారం చేయడంలో తన బలహీనతను తెలుపుతూ ఏడ్చారు. ఇప్పుడు ఆయ‌న సర్వేలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవమేమిటంటే, అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల ప్రజాదరణను చూసి కలవరపడుతున్నాడు ’’ అని త్రిపాఠి అన్నారు. ఒపీనియన్ పోల్స్‌ను నిషేధించడం వల్ల ఎస్పీని ఎన్నికల ఓటమి నుంచి తప్పుకోలేదని చెప్పారు. 

ఎన్నికల స‌మ‌యంలో ప‌లు మీడియా సంస్థలు, ఇత‌ర సంస్థ‌లు క‌లిసి ఒపీనియ‌న్ పోల్స్ నిర్వ‌హిస్తుంటాయి. ఇవి ఎన్నిక‌ల‌కు ముందు ఒక సారి, ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాలు రాక‌ముందు మ‌రో సారి పోల్స్ నిర్వ‌హిస్తాయి. ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉందో అంచ‌నా వేస్తాయి. 403 స్థానాలు ఉన్న ఉత్త‌ర ప్ర‌దేశ్ అసెంబ్లీకి ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3,7 వ‌ తేదీల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. మార్చి 10 తేదీన ఫ‌లితాలు లెక్కిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios