జడ్జీలపై పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు.. వాదనలు చేయదలుచుకోలేదన్న సీజేఐ !
New Delhi: దేశంలో కొందరు న్యాయమూర్తులు యాంటీ-ఇండియా గ్యాంగ్ లో భాగమయ్యారంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ తాను వాదనలు చేయదలుచుకోవడం లేదనీ, జడ్జీల నియామకంలో కొలీజియం వ్యవస్థ పనితీరు బాగానే ఉందనీ, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే బయటి ప్రభావాల నుంచి రక్షించబడాలని వ్యాఖ్యనించారు.

CJI DY Chandrachud-Union Minister Kiren Rijiju: మరోసారి కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థల మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. గత కొంతకాలంగా జడ్జీల నియామకం, పాలనలో న్యాయవ్యవస్థ జోక్యం పెరుగుతున్నదని కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే చాలా సార్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి నేరుగానే న్యాయ వ్యవస్థను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మరోసారి జడ్జీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొందరు న్యాయమూర్తులు యాంటీ-ఇండియా గ్యాంగ్ లో భాగమయ్యారంటూ ఆరోపించారు. ఇదే క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొలీజియంను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాను వాదనలు చేయదలుచుకోవడం లేదనీ, జడ్జీల నియామకంలో కొలీజియం వ్యవస్థ పనితీరు బాగానే ఉందనీ, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే బయటి ప్రభావాల నుంచి రక్షించబడాలంటూ కేంద్ర నడుచుకుంటున్న తీరును ఎత్తిచూపారు.
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన ఇండియా టుడే సదస్సులో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టే కొందరు రిటైర్డ్, యాక్టివిస్ట్ జడ్జీలు న్యాయవ్యవస్థను ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఒత్తిడి తెస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొలీజియం వ్యవస్థ కాంగ్రెస్ దుస్సాహసానికి నిదర్శనమంటూ విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సైతం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడమే లక్ష్యంగా న్యాయమూర్తులను నియమించే యంత్రాంగం కొలీజియం ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. "ప్రతి వ్యవస్థ పరిపూర్ణమైనది కాదు, కానీ ఇది మేము అభివృద్ధి చేసిన ఉత్తమ వ్యవస్థ" అంటూ కొలీజియంపై సీజేఐ వ్యాఖ్యానించారు.
భారత న్యాయవ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాల్సిన అవసరం ఉందని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. భారత న్యాయవ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాల్సిన అవసరం ఉందనీ, ఇప్పటికే కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు. తీర్పుల అనువాదం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ ఉపయోగించే అవకాశాలను గురించి కూడా ప్రస్తావించారు. అలాగే, న్యాయమూర్తులుగా నియమించడానికి సిఫారసు చేసిన పేర్లను ప్రభుత్వం ఆమోదించకపోవడానికి గల కారణాలను కొలీజియం బహిర్గతం చేయడంతో ఈ అంశంలో కేంద్రం వ్యాఖ్యలను ఎత్తిచూపారు. ఈ విషయంలో కేంద్రమంత్రితో వాదలనలు చేసుకోవాలకోవట్లేదని తెలిపారు. కేంద్ర మంత్రికి ఒక అభిప్రాయం ఉంటే.. తనకు ఒక అభిప్రాయం ఉంటుందనీ, అందులో తప్పులేదంటూ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో ఇవి సాధారణంగా కనిపించే విషయాలని తెలిపారు. తీర్పుల్లో ప్రభుత్వ జోక్యం, ఒత్తిడి ఉండదని చెప్పారు.
అయితే, కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. "రిటైర్డ్ న్యాయమూర్తుల్లో కొందరు.. బహుశా ముగ్గురు లేదా నలుగురు భారత వ్యతిరేక ముఠాలో భాగంగా ఉన్నారు.. వీళ్లు భారత న్యాయవ్యవస్థను ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు" అని అన్నారు. న్యాయ నియామకాలను ప్రారంభించడంలో, ఖరారు చేయడంలో న్యాయవ్యవస్థ పాత్ర ఏమీ లేదని రిజిజు అన్నారు. ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీ దుస్సాహసం వల్లే సుప్రీంకోర్టు వ్యవహరించడం ప్రారంభించిందనీ, దీనిని కొందరు న్యాయవ్యవస్థ అతిక్రమణగా అభివర్ణించారు. అప్పుడు కొలీజియం వ్యవస్థ ఉనికిలోకి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టే వరకు కొలీజియం వ్యవస్థ అమల్లో ఉంటుందని పేర్కొంటూ.. న్యాయమూర్తులను జ్యుడీషియల్ ఆర్డర్ ద్వారా నియమించలేమనీ, ఇది పూర్తిగా పరిపాలనాపరమైనదని రిజిజు స్పష్టం చేశారు. కార్య నిర్వాహక నియామకాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే, న్యాయవ్యవస్థను పట్టించుకునేదెవరని ప్రశ్నించారు.