కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. కశ్మీర్ సమస్యకు నాటి ప్రధాని నెహ్రూయే కారణమని ఆరోపించారు. నెహ్రూ నిర్ణయం వల్ల ఎంతోమంది అమాయకులు చనిపోయారని షా గుర్తు చేశారు.

నెహ్రూ కారణంగా కశ్మీర్‌లో మూడింట ఒక వంతు భూభాగాన్ని కోల్పోయామని.. సర్దార్ పటేల్ సలహా తీసుకుని వుంటే కాశ్మీర్ సమస్య ఉండేది కాదని అమిత్ షా స్పష్టం చేశారు. మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించడం తప్పని ఎద్దేవా చేశారు.

అయితే అమిత్ షా వ్యాఖ్యలతో కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలపాటు పొడిగిస్తూ రూపొందించిన బిల్లును అమిత్ షా శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలన గడువు వచ్చే నెల 2వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో జూలై 2వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో..జూలై 3 నుంచి మరో ఆరు నెలల పాటు దీనిని పొడిగిస్తూ కేంద్రం ప్రతిపాదించింది.

రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉండాలంటే రాష్ట్రపతి పాలన అవసరమని అమిత్ షా పేర్కొన్నారు. అమర్‌నాథ్ యాత్ర దృష్ట్యా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అమిత్ షా వెల్లడించారు.

అలాగే ఈ ఏడాది చివరలో జమ్మూశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని హోంమంత్రి పేర్కొన్నారు. దీనితో పాటు జమ్మూకశ్మీర్‌లో కుల మతాలకు అతీతంగా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశ్యంతో జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ చట్ట సవరణ-2019 బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు ప్రకారం వాస్తవాధీన రేఖతో పాటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి నివసించే ప్రజలందరికీ 3 శాతం రిజర్వేషన్ లభించనుంది. తద్వారా 3 లక్షల మంది యువత లబ్ధి పొందుతారని హోంమంత్రి లోక్‌సభకు తెలిపారు.

ఇక అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకశ్మీర్ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. ఎన్నికలు నిర్వహించే వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగింపుకు తీర్మానం ప్రవేశపెట్టారు.