ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలను ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్న ఆయన... అక్కడి ఉన్నతాధికారులతో భద్రతపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం సమావేశ వివరాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం మీడియాకు వివరించారు. ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించొద్దని... ఉగ్రవాదులకు అందుతున్న నిధుల విషయంలో తీసుకుంటున్న కఠిన చర్యలను కొనసాగించాలన్నారు.

అమరవీరులకు సముచిత స్థానం ఇవ్వాలని.. పేర్లను రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలకు పెట్టాలని అమిత్ షా ఆదేశించినట్లు సుబ్రమణ్యం తెలిపారు. అలాగే అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

గతేడాది కన్నా ఈ ఏడాది భద్రతను మరింత పెంచారు. యాత్రకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పరిపాలన విభాగం చేస్తున్న ఏర్పాట్లతో పాటు ఇతర ఏర్పాట్లపై హోంమంత్రి చర్చించినట్లుగా తెలిపారు.

భక్తుల సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించాలని షా అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు.