పీఎంసీ బ్యాంక్( పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్) బ్యాంక్ భారీ స్కాంకి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆ బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్న డబ్బు పోయిందని ఇప్పటికే ఆ బ్యాంకు ఖాతాదారులు కంగారు పడిపోతున్నారు. తమ డబ్బు తమకు ఇవ్వాలంటూ ఇప్పటికే ఆ బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చేపడుతున్నారు.  కాగా... తాజాగా ఓ ఖాతాదారుడు ఏకంగా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన తీవ్రంగా కలకలం రేపుతోంది. 

మృతుడు సంజయ్ గులాటీ(51) గా పోలీసులు గుర్తించారు. సంజయ్ నిన్న కోర్టు ఎదుట పీఎంసీ ఖాతాదారులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. కాగా... అతని బ్యాంకు ఖాతాలో రూ.90లక్షలు ఉన్నట్లు అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు.  డబ్బు పోతుందనే ఆందోళన కారణంగానే అతను గుండెపోటుకు గురయ్యాడని చెబుతున్నారు.

 ఈ సందర్భంగా సంజయ్ గులాటీ కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. సంజయ్ కి వ్యాపార నిమిత్తం డబ్బుల అవసరం ఉందని అన్నారు. బ్యాంకులో డబ్బులు ఇవ్వకపోవడంతో చాలా కాలంగా ఆందోళనకు  గురౌతున్నట్లు చెప్పారు. దాని మూలంగానే గుండెపోటు వచ్చిందని వాపోయారు. సంజయ్ మృతికి పీఎంసీనే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా భారతీయ రిజర్వు బ్యాంక్ ... పీఎంసీ ఖాతాదారులకు ఉపశమనం కలిగించింది. పీఎంసీ బ్యాంకు నుంచి ఖాతాదారులు తీసుకునే మొత్తాన్ని రూ.25వేల నుంచి రూ.40వేలకు పెంచుతున్నట్లు పేర్కొంది.