శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, ఉగ్రమూకల మద్య మంగళవారం అర్థరాత్రి జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటన స్థలంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలతో పాటు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

షోపియాన్ జిల్లా సుగాన్ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్న సమాచారంతో భద్రతా బలగాలు స్థానిక పోలీసుల సహకారంతో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై ఉగ్రమూక ఒక్కసారిగా కాల్పులకు తెగబడింది. అయినా వారిని లొంగిపోవాల్సిందిగా బలగాలు హెచ్చరించాయి. అయినప్పటికి వారు కాల్పులను కొనసాగించడంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయి. 

ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందినట్లు... జవాన్లందరూ సురక్షితంగా వున్నట్లు భద్రత అధికారులు వెల్లడించారు. ఇదిలావుంటే మంగళవారం ఓ ఉగ్రవాద మూక గండేర్ బల్ జిల్లాలో బీజేపీ నాయకుడు గులాం ఖదీర్ పై దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీసు కానిస్టేబుల్ ముహ్మద్ అల్తాఫ్ తీవ్రంగా గాయపడి మరణించారు.