మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులపై దాడి చేసిన గ్రామస్తులు.. వారిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులపై దాడి చేసిన గ్రామస్తులు.. వారిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్ గుమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి బాధిత బాలిక ఆమె కుటుంబంతో కలిసి పక్క గ్రామంలోని వివాహ వేడుకకు వెళ్లింది. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా.. బస్సులు అందుబాటులో లేకుండా పోయాయి. అయితే ఆ మార్గంలో బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు వారి గ్రామానికే చెందిన వారు కావడంతో బాలికను ఇంటి వద్ద దింపమని ఆమె తండ్రి వారిని కోరాడు.
అయితే బాలికను ఇంటికి తీసుకొస్తుండగా.. ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత తనపై జరిగిన అత్యాచారం గురించి బాలిక ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన కుటుంబ సభ్యులు నిందితులపై దాడి చేసేందుకు బయలుదేరారు. గ్రామంలోని మరికొందరు కూడా వారికి జత కలిశారు. పక్క గ్రామంలో నిందితులను పట్టుకుని.. వారిని గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం వారిపై దాడి చేసి.. కిరోసిన్ పోసి నిప్పంటించారు. నిందితుల్లో ఒకరు మరణించగా.. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతనికి రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉంది.
ఇందుకు సంబంధించి బాధిత బాలిక కుటుంబం సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం పంపుతామని అధికారి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆ ప్రాంతంలో పోలీసు బృందాన్ని మోహరించినట్లు ఆయన తెలిపారు.
