ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమ చావుకి ఎవరూ కారణం కాదంటూ ఓ వీడియో తీసి... దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి మరీ వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన  పంజాబ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పంజాబ్ రాష్ట్రం గుజ్రాన్ గ్రామానికి చెందిన సిక్కు యువకుడు(25) దళిత యువతి(20) ప్రేమించుకున్నారు. సదరు యువకుడు ఇంటర్ తర్వాత చదువు మానేసి పొలం పనులు చేసుకుంటున్నాడు. కాగా యువతి మాత్రం డిగ్రీ చదువుతోంది. కాగా... వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో పెద్దలకు తెలీదు.

కాగా.. గురువారం ఈ ప్రేమజంట... పొలానికి వెళ్లారు. అక్కడ తాము ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డామని పేర్కొంటూ వాట్సాప్‌లో తమ స్నేహితులకు వీడియో పంపించారు. ‘ మేము ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. దయచేసి నా కుటుంబ సభ్యులు, స్నేహితులను ఈ విషయమై ఇబ్బంది పెట్టకూడదని పోలీసులను కోరుతున్నా. నేను నా వాళ్లను చాలా కష్టపెట్టాను. అందుకు క్షమాపణలు చెబుతున్నా. మీరందరూ అంటే నాకెంతో ఇష్టం. భయంతో చచ్చిపోతున్నా అని నా ప్రత్యర్థులు భావించవచ్చు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల విధిలేని పరిస్థితుల్లో ప్రాణాలు తీసుకుంటున్నా’ అని సదరు యువకుడు వీడియోలో పేర్కొన్నాడు. ఆ తర్వాత తుపాకీతో యువతి పొట్టలో కాల్చి, తాను రెండుసార్లు మెడపై కాల్చుకుని కుప్పకూలాడు.

కాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్ట్‌ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతోందని... అందుకే వారు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.