ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. 

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (Asaduddin Owaisi) కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. అసుద్దీన్‌పై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన సచిన్ శర్మ (Sachin Sharma) పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించాడు. దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందువల్లే ఒవైసీపై తాము కాల్పులు జరిపామని పోలీసులకు చెప్పాడు. మరో మూడు ర్యాలీలలో ఒవైసీని చంపడానికి ప్రయత్నించినట్లు పోలీసులు విచారణలో అంగీకరించినట్టుగా సమాచారం. జనం ఎక్కువగా ఉండడం వల్ల అసదుద్దీన్‌పై దాడి చేయకుండా వెనక్కి తగ్గామని వెల్లడించాడు. 

అసలేం జరిగింది..
పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్‌–ఘజియాబాద్‌ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. కాల్పులు జరిపిన వెంటనే ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ‘ఒక నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో బాధపడ్డామని నిందితులు చెప్పారు. వారిని కోర్టు ముందు హాజరు పరుస్తాము’ అని ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. వివరణాత్మక విచారణ, సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని తేలిందని ప్రశాంత్ కుమార్ చెప్పారు. కొద్ది గంటల్లోనే ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. ఘటనకు ఉపయోగించిన ఆయుధం, కారు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. 

ఈ కాల్పుల ఘటనపై సీరియస్ తీసుకున్న కేంద్ర హోం శాఖ అసదుద్దీన్‌కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ భద్రతపై సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ.. సీఆర్పీఎఫ్‌తో జెడ్ కేటగిరి భద్రతా కల్పించాలని నిర్ణయం తీసుకుంది. తక్షణమే అసదుద్దీన్‌కు ఈ భద్రత అమల్లోకి రానుంది. 

జెడ్ కేటగిరి భద్రత వద్దన ఒవైసీ..
తాను చావుకు భయపడటం లేదని.. తనకు ‘‘జడ్’’ కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదని అసదుద్దీన్ లోక్‌సభ వేదికగా వెల్లడించారు. తాను సామాన్య పౌరుడిలా ఏ కేటగిరీలో వుంటానని.. కాల్పులు జరిపిన వారిని శిక్షించాలని అసదుద్దీన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోందని చెప్పారు. సోమవారం లోక్‌సభలో అమిత్ షా దీనిపై ప్రకటన చేస్తారని పీయూష్ గోయల్ వెల్లడించారు.